రోకలి పోటు.. దెబ్బ మీద దెబ్బ... ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నా చిత్తూరు జిల్లా రైతన్నల కష్టాలకు సరిపోవు. అసలే కరవు సీమ. రాళ్లు తప్ప చుక్కనీరు కనిపించని పరిస్థితులు. అయినా సాగుకు దూరం కావటం ఇష్టం లేని రైతన్నలు సాధ్యమైనంత వరకూ రుణాలు తీసుకుని బోర్లు వేయించుకున్నారు. భవిష్యత్తుపై ఆశతో పంట చేతికి వస్తుందనే నమ్మకంతో ఆరుగాలం శ్రమించారు. కష్టానికి ప్రతిఫలం అన్నట్లు ఈసారి పచ్చని పైర్లు కనిపించాయి. కడగండ్లు సమసిపోతాయనుకున్న రైతుల పాలిట కరోనా మహమ్మారి శరాఘాతంగా మారింది
లాక్‌డౌన్ కారణంగా కూలీలు దొరక్క పంట కోయలేని పరిస్థితి. రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబ సభ్యులంతా కలిసి పంటను కోసినా అమ్ముకునేందుకు ఆస్కారమే లేని వైనం రైతన్నల నడ్డి విరిచింది. రవాణా స్తంభించి పంటను ఎక్కడికీ తరలించలేక పొలాల్లోనే నిల్వచేసిన రైతన్నలను విధి సైతం వెక్కిరించింది. పొలాల నుంచి పంట తరలించలేక ఆశగా ఎదురుచూస్తున్న వారిని అకాల వర్షాలు తీవ్రంగా నష్టపరిచాయి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి పరిధిలో వేల ఎకరాల్లో టమోటా, మొక్కజొన్న, అలసంద, దోస, క్యారెట్ సాగు చేశారు. పంటలన్నీ వర్షం ధాటికి పొలాల్లోనే నీట మునగడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.
బోర్ల కోసం, పంట సాగు కోసం,ఎరువుల కోసం ఇప్పటికే లక్షల రూపాయల్లో ఖర్చు చేశామని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు.