CBN MEETING WITH PARTY LEADERS ‘తెదేపా కోసం పని చేసేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తాం. లేకుంటే పక్కన పెడతా. ఇదే చివరి అవకాశం. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. నిర్లక్ష్యం వహిస్తే పూర్తిగా తొలగిస్తా’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు కార్యకర్తలను హెచ్చరించినట్లు సమాచారం. కుప్పం తెదేపా కార్యాలయంలో గురువారం సాయంత్రం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలి. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గ్రామాల్లో చురుకుగా చేపట్టాలి. కొంతమంది సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి. పని చేసేవారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వైకాపా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసహనంగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల తరఫున పోరాడాలి. సాంకేతికతను ఉపయోగించుకొని ఉపాధి సాధనపై పట్టు సాధించాలి’ అని పేర్కొన్నారు. ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం, పీఏ మనోహర్, నాలుగు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు తెదేపా-ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌లో అన్నదాన కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించి.. భోజనం వడ్డించారు. ఆధునికీకరించిన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని పునఃప్రారంభించారు.
బాధితులకు పరామర్శ: అంతకు ముందు వైకాపా శ్రేణుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆస్పత్రిలో చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబీలకు ధైర్యం చెప్పారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్న ఆయన.. తప్పుడు పనులు చేసిన వారికి శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
26 మంది తెదేపా నాయకులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదటి రోజు కుప్పం పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలపై ఆ పార్టీ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో తెదేపా నాయకులు 26 మందిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైకాపా జెండాలు, తోరణాల వివాదంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరగ్గా. కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
ఈ సమయంలో రాళ్ళబుదుగూరు ఎస్సై మునిస్వామితో పాటు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. ఎస్సై మునిస్వామి ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులుతో పాటు మరో ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం వెంకటాపురానికి చెందిన వైకాపా నేత గణేష్ ఫిర్యాదుతో మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజకుమార్ తో సహా 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన ఎ.ధనరాజ్ ఫిర్యాదు మేరకు తెదేపా నేత నరసింహులు సహా 11 మంది పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: