Chandrababu fire on YSRCP: వైకాపాది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని.. ఆ పార్టీకి సమయం దగ్గరపడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. ఒక్క సీటు కూడా నెగ్గలేరని పేర్కొన్నారు. పులివెందులలోనూ వైకాపాను భూస్థాపితం చేస్తామని సవాల్ చేశారు. తెదేపా పోరాటానికి ప్రజలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలిరోజు బుధవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొంగనపల్లి, కొల్లుపల్లి గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైకాపా నాయకులు పులివెందులలో ఏం చేశామని ఓట్లు అడుగుతారు? రాజకీయం వేరు.. అభివృద్ధి వేరని నేను పులివెందులకే మొదట నీళ్లిచ్చాను. 40 ఏళ్లుగా తెదేపా జెండా ఎగిరిన గడ్డ కుప్పం. జగన్...ఈ నియోజకవర్గాన్ని పులివెందులలా మార్చలేవు’ అని నిప్పులు చెరిగారు. ‘వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిచే పరిస్థితి లేదు. అందుకే రౌడీయిజానికి దిగి విజయం సాధించాలని చూస్తున్నారు. నేను రౌడీలకే రౌడీనే. నీతి, న్యాయానికి తప్ప దేనికీ భయపడను. ఈ వైకాపా నాయకులకు భయపడతానా? ప్రజాధనాన్ని వైకాపా నాయకులు పందికొక్కుల్లా దోచుకుంటున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి సొమ్మంతా కక్కిస్తా’ అని స్పష్టం చేశారు.
రూ.15 కోట్ల కంపెనీ రూ.500 కోట్ల భూములు కొంటుందా?
శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 8,500 ఎకరాలను ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆయన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కారుచౌకగా రూ.500 కోట్లకు కొట్టేసేందుకు పథకం పన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఇందూ సంస్థకు.. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట 8,844 ఎకరాలను వైఎస్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీబీఐ తేల్చింది.
ఈ కేసులో జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ.18 వేల కోట్లు- రూ.27 వేల కోట్లు విలువ చేసే భూమిని కారుచౌకగా అప్పగిస్తున్నారు. తీరా చూస్తే ఆ భూములు కొనే సంస్థ టర్నోవర్ రూ.15 కోట్లు. ఆ సంస్థకు రూ.500 కోట్లు చెల్లించే స్థోమత ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమరనాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గంటా నరహరి, తెదేపా రాష్ట్ర మీడియా సమన్వయకర్త శ్రీధర్‌వర్మ తదితరులు ఉన్నారు.
చంద్రబాబు పర్యటనలో వైకాపా ఆగడాలు, ఇరువర్గాల రాళ్ల దాడి.. పోలీసులకూ గాయాలు
తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో వైకాపా శ్రేణులు అడుగడుగునా ఆటంకాలు కల్పించాయి. చంద్రబాబు పర్యటిస్తున్న కొంగనపల్లి, కొల్లుపల్లి గ్రామాల్లో రాత్రికి రాత్రే వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు. కొంగనపల్లిలో ఓ వైకాపా కార్యకర్త.. ఆ పార్టీ జెండా పట్టుకుని చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా తెదేపా కార్యకర్తలు అతణ్ని పక్కకు పంపేశారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి కొల్లుపల్లికి చేరుకుని చంద్రబాబు, తెదేపా కార్యకర్తలను దుర్భాషలాడారు. అతనికి మద్దతుగా సుమారు 20 మంది వైకాపా కార్యకర్తలు వచ్చారు.
చంద్రబాబు పర్యటనలో వైకాపా జెండాలు ఊపడం సరికాదని తెదేపా కార్యకర్తలు సర్దిచెబుతుండగా.. వారు ఎదురుతిరిగారు. దీంతో ఇరువర్గాల వాగ్వాదానికి, ఆపై రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు వారించేందుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో లాఠీలు ఝుళిపించారు. ఘర్షణలో తెదేపా, వైకాపా కార్యకర్తలు, రాళ్లబూదుగూరు ఎస్సై మునిస్వామితోపాటు పలువురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రబాబు కాన్వాయ్ కొల్లుపల్లికి వచ్చే ముందు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి.. వైకాపా కార్యకర్తలను ఓ ఇంట్లో పెట్టి తాళం వేశారు. సుమారు 70 మంది పోలీసులున్నా.. 20 మంది వైకాపా కార్యకర్తలను అదుపు చేయలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై చంద్రబాబు ప్రసంగిస్తూ.. నా సొంత నియోజకవర్గంలో నాకు భద్రత కల్పించలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారా అని ప్రశ్నించారు. ‘జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నన్ను కుప్పంలో అడ్డుకోవాలని చూస్తున్నారు. వైకాపా నాయకులు కొందరు రౌడీలకు మద్యం పోయించి ఇటువంటి గొడవలకు ఉసిగొల్పుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఎంపీ బట్టలు విప్పిన వీడియో బయటకు వస్తే.. అతనితో రాజీనామా చేయించాల్సిన సీఎం వత్తాసు పలుకుతున్నారు. రాజీనామా చేయమని డిమాండ్ చేసిన మాపైనే కేసులు పెడతారా’ అని నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలకు సహకరించడమేంటని పలమనేరు డీఎస్పీ గంగయ్యపై చంద్రబాబు మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి రామకుప్పం వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు.
ఇవీ చూడండి