CBN Fire On YSRCP Govt: ప్రజలు అధికార పీఠమెక్కిస్తే.. వైకాపా ప్రభుత్వం మాత్రం వారిపై దాడులు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండో రోజు పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగానూరు సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలపై పోరాడేవారిని ప్రభుత్వం వేధిస్తోందన్న బాబు.. బాధితుల్లో వైకాపా నేతలూ ఉన్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని మండిపడ్డారు. మద్యం తయారీలోనూ రసాయనాలు కలుపుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు దోపిడికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కుప్పం నుంచే పోటీ చేసి.. మళ్లీ సీఎం అవుతానన్నారు. తెదేపా అధికారంలోకి రావటం.. తాను సీఎం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
'ప్రజా సమస్యలపై పోరాడేవారిని వేధిస్తున్నారు. ఎన్నికల కోసం కుప్పం రాకున్నా ఏడుసార్లు గెలిపించారు. పొత్తుల్లేకుండా ఎన్నోసార్లు గెలిచాం. వైకాపాకు రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదు.' వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయి. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు దోపిడీ. తెదేపా అధికారంలోకి రావడం, నేను సీఎం అవ్వడం ఖాయం. కుప్పం నుంచే పోటీ చేస్తా... మళ్లీ సీఎం అవుతా. స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం. - చంద్రబాబు, తెదేపా అధినేత
తనకు కుప్పం నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. కుప్పం ఆస్పత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఆ పథకాలు ఏమయ్యాయి..?
చంద్రన్నబీమా, పెళ్లి కానుక, బీసీలకు ఇచ్చే సబ్‌ప్లాన్, ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా ఇప్పుడు ఏమయ్యాయని ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలోని నూలుకుంట సభలో ప్రసంగించిన ఆయన.. తమ ప్రభుత్వ హయంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. న్యాయం, ధర్మం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని.. వైకాపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతమందిని జైలుకు పంపిస్తారో మేమూ చూస్తామన్నారు. నీతినిజాయతీకి మారుపేరైన కుప్పం నియోజకవర్గాన్ని చెడగొట్టేందుకు కొందరు దొంగలు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా.. భయపడే వాళ్లు లేరని అన్నారు.
"రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏమయ్యాయి. న్యాయం, ధర్మం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బెదిరింపులకు భయపడేది లేదు. వైకాపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలి. ఎంతమందిని జైలుకు పంపిస్తారో మేమూ చూస్తాం. నీతినిజాయతీకి మారుపేరు కుప్పం. కుప్పం నియోజకవర్గాన్ని చెడగొట్టేందుకు కొందరు దొంగలు వచ్చారు. ఎవరెన్ని బెదిరింపులు చేసినా భయపడే వాళ్లు లేరు. చదువుకున్న యువత ముందుకొస్తే.. వారికి అండగా ఉంటా." - చంద్రబాబు, తెదేపా అధినేత
నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ..
కుప్పంలోని దాసెగోనూరు చెరువుకు మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేస్తూ..నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. గత నెలలో వచ్చిన వరదలకు చెరువుకట్ట దెబ్బతిందని లేఖలో పేర్కొన్నారు. చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకున్నారని..,దెబ్బతిన్న చెరువు తూములనూ బాగు చేయాలని కోరారు. కుప్పం చెరువుల లింక్‌కు ఇచ్చిన ఉత్తర్వు అమలు చేయాలన్నారు.
కుప్పం పార్టీ కార్యక్రమాలను నేనే పర్యవేక్షిస్తా..
కుప్పం పార్టీ కార్యక్రమాలను స్వయంగా తానే పర్యవేక్షించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి వందమంది ఓటర్లకూ ఒక ప్రతినిధిని నియమిస్తానని అన్నారు. 25 బూత్‌లను క్లస్టర్‌గా మార్చి పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. నూలుకుంట కొత్తపల్లెలో గ్రామదేవతలకు పూజలు చేసిన చంద్రబాబు.. అనంతరం రోడ్ షో నిర్వహించారు.
ఇదీ చదవండి: