నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు రాష్ట్రంలోనూ మద్దతు లభించింది. ఉదయం నుంచే బంద్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రధాన కూడళ్ల దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.
తిరుపతి బస్టాండ్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పూర్ణకుంభం కూడలిలో రహదారిని దిగ్బంధం చేశారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ బస్సు సర్వీసులు నిలిపివేయగా.. తిరుమల వెళ్లే బస్సులకు మాత్రం బంద్ నుంచి మినహాయింపునిచ్చారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన చేపట్టారు.
శాంతియుతంగా బంద్
నగరి నియోజకవర్గం పుత్తూరులో రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ సజావుగా ముగిసింది. ఉదయం నుంచి స్థానిక కార్పొరేటర్ రోడ్డు కూడలిలో వామపక్ష నాయకులు బైఠాయించి శాంతియుతంగా బంద్ నిర్వహించారు. పుత్తూరులో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సైతం మూసివేశారు.
తహసీల్దార్‌కు వినతిపత్రం
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భారత్ బంద్‌కు మద్దతుగా తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా వెదురుకుప్పం తహసీల్దార్ కులశేఖర్‌కు తెదేపా నేతలు వినతిపత్రం అందించారు.
శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ
శ్రీకాళహస్తిలో భారత్ బంద్ పాక్షికంగా జరిగింది. శ్రీకాళహస్తిలో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌పై ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏపీ సీడ్స్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తమై శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
కుప్పం నియోజకవర్గంలో నిరసనలు
కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు.
గంగాధర నియోజకవర్గంలో
గంగాధర నియోజకవర్గంలో భారత్ బంద్‌కు మద్దతుగా తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. వెదురుకుప్పం మండలంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవస్థలు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, చోద్యం చూడటం సబబుకాదని అన్నారు.
దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా తంబళ్లపల్లిలో నిరసనలు జరిగాయి. తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించి తాసిల్దార్ భీమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:
'శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు అనుమతి సరికాదు'