తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల పిల్లలకు అశ్వని ఆసుపత్రి వైద్య సిబ్బంది పల్స్ పోలియో టీకాలు వేశారు. ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, బస్టాండ్ ప్రాంగణాలతో సహా మొత్తం 25 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశామని ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి నర్మదా తెలిపారు. మూడు రోజుల పాటు పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 5లక్షల 62వేల 610మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి టీకా అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2వేల 204, పట్టణ ప్రాంతాల్లో 481, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో 98, మొబైల్ కేంద్రాలు 88 ఏర్పాటు చేశారు. మొత్తం 2వేల871 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందునా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.
విశాఖలో..
విశాఖలో పల్స్ పొలియో కార్యక్రమం జరిగింది. చిన వాల్తేర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, వీఎమ్మార్డీఏ కమిషనర్ కోటేశ్వర్రావులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. పిల్లల నిండు జీవితానికి రెండు పోలియోచుక్కలు వేయించాలని కమిషనర్ సృజన తెలిపారు.
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో..
ఎలమంచిలిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో..
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని కొర్రుప్రోలులో ఎమ్మెల్యే బాబూరావు పోలియో కార్యక్రమం ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు కాపాడుకోవాలని సూచించారు.
అనకాపల్లిలో..
అనకాపల్లిలో అధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 పల్స్ పోలియో బూత్‌లు, 6 ట్రాన్సిస్ట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. 240 మంది సిబ్బందితో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా మైలవరంలో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో పోలియో చుక్కల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది స్థానిక చిన్నారులకు పోలియో నివారణ చుక్కలను వేశారు. పోలియో వ్యాధి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లాలో..
5 ఏళ్లలోపు చిన్నరులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా పాలనాధికారి దినేష్ కుమార్ కోరారు. శ్రీనివాసరావు తోటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
నెల్లూరు నగరంలో..
నెల్లూరు నగరం యూకో నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి చక్రధర్ బాబు ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో 3.76 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 3,067 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మూడు రోజులు నిలిపివేశామని వెల్లడించారు. సమష్టి కృషితో భారత్‌ను పోలియో రహిత దేశంగా మార్చుకున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా పాలనాధికారి పోలా భాస్కర్ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 58వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఇందుకోసం 2502 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల సంచార బృందాలను అందుబాటులో ఉంచారు.
కనిగిరిలో..
ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ స్థానిక వైద్యాధికారి రాజ్యలక్ష్మి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ ఏర్పాటే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు అందించారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో సమగ్ర శిక్షణ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి పైడి వెంకటరమణ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ బృందం పాల్గొన్నారు.
తమ్మినాయుడుపేటలో..
శ్రీకాకుళం తమ్మినాయుడుపేటలో ఇటుక బట్టీ పనిచేస్తున్న కూలీలా పిల్లలకు జిల్లా పాలనాధికారి నివాస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,33,683 మంది ఉన్నారని తెలిపారు. వారి కోసం మూడు లక్షల డోస్‌లను సిద్ధం చేశామని అన్నారు. పర్యవేక్షణకు 158 మంది సూపర్వైజర్లని నియమించామని చెప్పారు. 83 మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చిన్నారులను తీసుకు వచ్చే తల్లిదండ్రులు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: 'రామతీర్థం ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకురావాలి'