చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డా.అనితారాణిపై వైకాపా నేతల వేధింపులను వెంటనే ఆపాలని, బాధ్యులను అరెస్టు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన వైద్యురాలు అనితారాణిపై అధికార పార్టీ నేతల వేధింపులు సహించేది లేదన్నారు. ఆస్పత్రిలో అవినీతిని ప్రశ్నించినందుకు అధికార పార్టీ నేతలు ఆమెను నిర్బంధించి.. ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అన్నారు.
తనను వేధిస్తున్నారని వైద్యురాలు ఫిర్యాదు చేసి 2 నెలలు దాటినా పోలీసులు దర్యాప్తు చేయలేదని.. సాక్ష్యాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలని వైద్య వృత్తిని ఎంచుకున్న వెనుకబడిన వర్గానికి చెందిన వైద్యులు సుధాకర్, అనితారాణి పట్ల అధికార పార్టీ నాయకులు, పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమన్నారు.
డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ జిల్లా యంత్రాంగం స్పందించనట్లుగానే చిత్తూరు జిల్లా యంత్రాంగం డా.అనితారాణి పట్ల అదే విధంగా ప్రవర్తిస్తుందని అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం.. వైద్యురాలి వ్యవహారాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ డీజీపీని కోరారు.
ఇదీ చదవండి: