చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీ ఎగువ ఎస్సీ కాలనీకి చెందిన అంగన్వాడీ కార్యకర్త జి. శంకరమ్మ. వివాహమైన ఏడాదికే ఆమెను భర్త వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి తన తల్లితోనే ఉంటూ అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తోంది. తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లికి చెందిన హరినాథ్, రామ్మోహన్ మదనపల్లిలో చేనేత కార్మికులకు పని చేసేవారు. శంకరమ్మ మదనపల్లికి వచ్చి పోయే సమయంలో హరినాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చనువుగా ఉండేవారు. హరినాథ్, రామ్మోహన్ లకు శంకపమ్మ రూ4.30 లక్షల వరకు అప్పు ఇచ్చింది.
లాక్డౌన్లో ఇబ్బందుల కారణంగా అప్పు తిరిగి ఇవ్వాలని ఆమె వారిని ఒత్తిడి చేసింది. శంకరమ్మను అడ్డు తొలగించుకోవాలని హరినాథ్, రామ్మోహన్ నిర్ణయించుకున్నారు. మే 27న మదనపల్లెకు వస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు. ఆమె మదనపల్లికి రాగానే ఆటోలో బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు పీకల దాకా మద్యం తాగించారు. మత్తులో ఉన్న శంకరమ్మ గొంతుకు తాడు బిగించి కిరాతకంగా హత్య చేశారు.
ఆ తరువాత చనిపోయిన శంకరమ్మను గుర్తు పట్టలేని విధంగా కొట్టి ఆమె మృతదేహాన్ని అడవి ప్రాంతంలో వదిలి వెళ్లారు. శంకరమ్మ తల్లి రామలక్ష్మమ్మ ఈ నెల 9న తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హరినాథ్ మీద అనుమానం వ్యక్తం చేసింది. హరినాథ్, రామ్మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, ములకలచెరువు సీఐ సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇవీ చదవండి: తిరుపతిలో వృద్ధుడు దారుణ హత్య