తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆఫ్ సీజన్‌లో జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికుల అవసరాలు తీర్చేందుకు తితిదే ఐదు జలాశయాలను నిర్మించింది. ప్రస్తుతం కుమారధార పసుపుధార జంట జలాశయాల్లో 5,547 లక్షల గ్యాలన్లు నీటితో, పాపవినాశనంలో 5,240 లక్షల గ్యాలన్లు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ఈ మూడు జలాశయాల్లో గేట్లు ఎత్తి దిగువప్రాంతంకు నీటిని వదులుతున్నారు. ఆకాశగంగ, గోగర్బం జలాశయాలు 90 శాతం నీటి నిల్వలతో ఉన్నాయి. ఇవి కూడా అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదతో నిండుతాయని అధికారులు భావిస్తున్నారు.
'తిరుమలలో రోజుకు 30 నుంచి 35 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తారు. రద్దీ రోజుల్లో 40 లక్షల గ్యాలన్ల నీటిని భక్తుల అవసరాలకు వినియోగిస్తారు. పస్తుతం ఐదు జలాశయాలలో ఉన్న నీటితో ఏడాదికి సరిపడా అవసరాలు తీర్చుకోవచ్చని అధికారులు తెలిపారు. కరోనా ప్రభావంతో మార్చి నెల నుంచి మూడు నెలల పాటు భక్తులను పూర్తిగా తిరుమలకు అనుమతి నిలిపివేశాము. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా భక్తులను అనుమతిస్తున్నాము. ఆ సంఖ్య పది వేలకు మించడంలేదు. దీంతో కొండపై నీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. నీటి వినియోగం తగ్గడంతోపాటు వర్షాలు అధికంగా కురవటంతో జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టంకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది ఆక్టోబర్‌లో కురిసే వర్షాలతోనే నీటి నిల్వలు పెరుగుతాయి. ఈ ఏడాది ఆఫ్‌సీజన్‌లో వర్షాలకు జలాశయాలు నిండటంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.' - ధర్మారెడ్డి, తితిదే అదనపు ఈవో.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేశ్