చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ ధనేశ్వర్‌రెడ్డి అలియాస్ ధన(32) హత్యకేసులో ఆరుగురు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ఎర్రమద్దవారిపల్లెకు చెందిన రౌడీషీటర్ ధనేశ్వర్‌రెడ్డిని గత నెల 15వ తేదీ తెల్లవారుజామున కొంతమంది అతి కిరాతకంగా హత్య చేశారు. నిందితులను పట్టుకునేందుకు సీఐ సురేష్‌కుమార్, తంబళ్లపల్లె ఎస్సై సహదేవి ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. వారు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న నిందితులను అరెస్టు చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడైన శివశంకర్‌రెడ్డి అలియాస్ శివారెడ్డి 2017లో ధనేశ్వర్‌రెడ్డి సోదరుడైన జగదీశ్వర్‌రెడ్డిని హత్య చేశాడు. తన సోదరుడ్ని హత్య చేసిన శివశంకర్‌రెడ్డిని చంపుతానని ధనేశ్వర్‌రెడ్డి చెప్పడంతో అతన్ని చంపాలని శివశంకర్‌రెడ్డి పథకం వేశాడు. పథకంలో భాగంగా సోమలకు చెందిన ఆటో డ్రైవర్, పలు ద్విచక్రవాహనాల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న మల్లికార్జునను ధనేశ్వర్‌రెడ్డితో పరిచయం పెంచుకునేలా చేసి అతని కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొంతమందికి రూ.30 లక్షల సుపారీ ఇచ్చి వారితో ధనేశ్వర్‌రెడ్డిని చంపినట్లు వెల్లడైంది. కేసులో తంబళ్ళపల్లెకు చెందిన శివశంకర్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన డేవిడ్‌సన్, శ్రీనివాసన్ అలియాస్ సగా, అంబురాసన్ అలియాస్ అన్బు, నరేష్, ప్రభుదేవను శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: TELUGU ACADEMY SCAM: పక్కా ప్రణాళికతోనే తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్