రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. రెండోవారంలో ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల కంటే ముందే కీలక పోస్టులు భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నారు. కసరత్తు మొదలైందని తెలుసుకున్న నేతలు... జగన్ నివాసానికి క్యూ కట్టారు. అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చాలా మంది నేతలు తరలివస్తున్నారు.
మాటిచ్చారు.. గుర్తు చేస్తున్న నేతలు
వైకాపాలో పదవులు ఆశిస్తోన్న వారు వందకుపైగా ఉన్నారు. మూడోసారి, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు రేస్‌లో ఉన్నారు. మంత్రివర్గంలో అవకాశం రాని వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతిస్తామని స్వయంగా జగనే మాటిచ్చిన సంగతి నేతలు గుర్తు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తామని గతంలో జగన్ ప్రకటించారు. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తామని శాసన సభా పక్ష సమావేశంలోనూ తెలిపినందున చాలా మంది సీనియర్ , జూనియర్ ఎమ్మెల్యేలు వీటిపై ఆశలు పెట్టుకున్నారు.
వీళ్లకు ఫిక్స్!
నగరి ఎమ్మెల్యే రోజాకు ఎపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఖరారైనట్టు తెలుస్తోంది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేసులో వాసిరెడ్డి పద్మ ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర గిరిజన సలహా మండలి ఛైర్మన్ పదవికి ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పోలవరం ఎమ్మెల్యే టి. బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎక్కువ అవకాశం ఉందని పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ పదవి సీఎంకు కాకుండా ఇతరులకివ్వాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి తితిదే సభ్యుడు లేదా మరేదైనా కీలక పదవి దక్కే అవకాశం ఉంది.
ఆశావహుల క్యూ
మంత్రులతో కలిసి కొందరు నేతలు సీఎంతో సమావేశమయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కడప జిల్లా నుంచి శ్రీకాంత్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి యస్ వి మోహన్ రెడ్డి, గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నుంచి కాసు మహేష్ రెడ్డి , కృష్ణా జిల్లా నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాల శౌరీ, డీవై దాస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోఠారు అబ్బయ్య చౌదరి... జగన్ సహా కీలక వ్యక్తులను కలిసిన వారిలో ఉన్నారు.
చిరునవ్వే సమాధానం
ఈ పదవులకు ఎమ్మెల్యేలతోపాటు ద్వితీయ శ్రేణి నేతలు, ఎన్నికల్లో ఓడిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. తనను కలిసిన వారిలో కొందరికి మాత్రమే జగన్ హామీ ఇస్తుండగా.. మరికొందరికి మాత్రం చిరునవ్వుతో సమాధానపరుస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.