ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు నిర్వహిస్తుంటే... రాష్ట్రంలో పరిపాలనా విధానం ఎటువైపునకు వెళ్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా... దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడ్ని చేసే విధంగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని విమర్శించారు. వైకాపా నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉండవల్లిలో మాట్లాడిన ఆమె... ప్రజల మనోభావాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఏకంగా దేవునిపైనే కుట్రలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.