సినీ నటుడు శివాజీ.. మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెదేపా ప్రభుత్వ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజలకు తెలిసేలా వీడియోలు ప్రదర్శించారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేనని చెప్పారు. కేసీఆర్ పన్నాగాల్లో చిక్కుకోవద్దని వైకాపా అధినేత జగన్ కు సూచించారు. పోలవరాన్ని అడ్డుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వమే అని ఆరోపించిన శివాజీ.. అలాంటి వారి మాటలు వినవద్దని జగన్ కు చెప్పారు.
''రాజధానిలో ఒక్క ఇటుక పడలేదని జగన్ అన్నారు. అందులో ఎంత వాస్తవం ఉందో స్వయంగా పరిశీలించా. గ్రాఫిక్స్ అంటూ ప్రచారం చేయడం కాదు... వాస్తవాలు గ్రహించాలి. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే గ్రాఫిక్స్ అంటారా? జగన్మోహన్‌రెడ్డి చెప్పిందంతా శుద్ధ అబద్ధం. అద్భుతంగా నిర్మాణాలు సాగుతుంటే ఏమీ చేయట్లేదంటారా? అబద్ధాలు పదేపదే ప్రచారం చేస్తే నిజాలు అయిపోవు. సచివాలయం భవనం నిర్మిస్తున్న మాట వాస్తవం. తాత్కాలిక భవనాలు అంటూ హేళన చేయడం సమంజసం కాదు. పక్కనే శాశ్వత భవనాలు నిర్మిస్తుంటే అవి కనపడవా? టవర్లు, భవనాలు 40 వారాల్లో పూర్తవుతాయని అధికారులు చెప్పారు'' - శివాజీ, సినీ నటుడు
చంద్రబాబు అద్భుతమైన ముందుచూపు ఉన్న నాయకుడని గతంలో కేసీఆర్ చెప్పారన్న విషయాన్ని శివాజీ గుర్తు చేశారు. ఇవాళ అదే చంద్రబాబును ఏం చేశావంటూ కేసీఆర్ పదేపదే విమర్శించడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో కంపెనీలు వచ్చాయా లేదా అన్న అంశంపై వీడియో చూపించారు. జగన్‌కు మొదటి శత్రువు విజయసాయిరెడ్డి అని శివాజీ వ్యాఖ్యానించారు. విజయసాయి ట్వీట్లు చూస్తుంటే జగన్‌కు శత్రువని తెలుస్తోందన్నారు. పవన్ కల్యాణ్ ఏదైనా చెబితే వింటారనీ.. ముందుకొస్తారనీ చెప్పారు. కేఏ పాల్ ఆయన స్థాయి దిగజార్చుకున్నారే తప్ప మరొకటి కాదన్నారు.