పోలవరం పునఃసమీక్ష నిపుణుల కమిటీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో కాంట్రాక్టరుకు 1331 కోట్ల రూపాయల మేర అదనపు ప్రయోజనం కల్పించారని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టులో హైడ్రో ఎలక్ట్రిక్ హైడల్ ప్రాజెక్టుకు 787 కోట్ల రూపాయల ముందస్తు చెల్లింపులు ఏమిటని ప్రశ్నించింది. ప్రాజెక్టు పనుల్లో బిల్లుల చెల్లింపుపై ముందస్తు తనిఖీ వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. కోడ్ నిబంధనలేవీ పాటించలేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పోలవరం ప్రాజెక్టులో పాత కాంట్రాక్టర్లను కొనసాగించటమా ? లేదా ? అనే అంశాన్ని ప్రభుత్వం న్యాయపరంగా ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సాంకేతిక కమిటీ సిఫార్సులు చేసింది. ఒప్పందానికి విరుద్ధంగా కొత్త ధరలు ఇచ్చేశారని కమిటీ పేర్కొంది. 1331 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టరుకు ప్రయోజనం కల్పించారని కమిటీ స్పష్టం చేసింది. జలవనరుల ప్రాజెక్టు, హైడ్రో ఎలక్ట్రిక పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా, 2243 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టు సంస్థలకు అదనపు ప్రయోజనాలు కల్పించారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో ట్రాన్స్ ట్రాయ్ తో ఒప్పంద గడువు ముగియకపోవటంతో 2015-16 ధరలు వర్తింపచేయటం వల్ల ఈ అదనపు ప్రయోజనం కలిగిందని కమిటీ సిఫార్సు చేసింది. నిబంధనల ఉల్లంఘనలు, ఇతర తప్పిదాలకు సంబంధించి న్యాయపరమైన సలహాలు ముగిసిన అనంతరం చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు కొత్త ధరలు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమని కమిటీ వ్యాఖ్యానించింది. 5385 కోట్లకు కుదిరిన ఒప్పందం ప్రకారం కంటే 1331 కోట్లు ఎక్కువ చెల్లించారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుల్లో సివిల్ పనులు ప్రధాన గుత్తేదారు నుంచి తొలగించి 60 సి నిబంధన కింద దాన్ని నవయుగకు కట్టబెట్టారని స్పష్టం చేసింది. గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేరే సంస్ధకు అప్పగించారని తెలిపింది. ప్రాజెక్టులో పని నెమ్మదిస్తే ..పెనాల్టీ పడుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించిన కమిటీ దాదాపు 20కి పైగా సిఫార్సులను ప్రభుత్వానికి అందించింది.
ఇదీ చదవండి: తూర్పు కృష్ణా కాలువకు నీటి విడుదల