Rains in AP due to low pressure in Bay of Bengal: దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 30కిమీ వేగంతో వాయుగుండం కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి 810 కిమీ, పుదుచ్చేరికి 920 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమైవుందని తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. కోస్తాంధ్రలో వాతావరణశాఖ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు గంటకు 50-70కిమీ, ఎల్లుండి నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచుకోవాలని వెల్లడించింది. ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పంజా విసురుతున్న చలి - ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
విధి ఆడిన వింత నాటకం - ప్రమాదం చూసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది