ఆగ్నేయ బంగాళాఖాతంలో 'ఫొని' తుపాను కొనసాగుతోంది. తుపాను మరింత బలపడి వాయవ్యదిశగా 9 కి.మీ. వేగంతో కదులుతోందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను క్రమంగా దిశ మార్చుకుని ఈశాన్యం వైపు మరలుతున్నట్లు అధికారులు గుర్తించారు. తుపాను మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్రింకోమలికి 850 కి.మీ. దూరంలో.. చెన్నైకి 1,200 కి.మీ,.. మచిలీపట్నానికి 1,390 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరో 24 గంటల్లో ఈ తుపాను మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30 నాటికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరానికి తుపాను దగ్గరగా రానుంది. తుపాను ప్రభావంతో 29, 30 తేదీల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందని.. తమిళనాడు, కోస్తాంధ్ర, పుదుచ్చేరి, కేరళలో భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల యంత్రాంగాలను కలెక్టర్లు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో అధికారులు రెండో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు కలెక్టర్ సూచించారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 29, 30 తేదీల్లో జిల్లాపై ప్రభావం ఉంటుందని కలెక్టర్ ముత్యాల రాజు హెచ్చరించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం మధ్యాహ్నంలోగా తీరానికి చేరుకోవాలన్నారు.
ఇదీ చదవండి