ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు శాస్త్రోక్తంగా, మంత్రోశ్చారణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణం తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది. అంతకుముందు ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కల్యాణ వేదిక వద్ద సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం జరిగింది.
పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు...
ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారిని దర్శించుకుని... కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ పక్కపక్కనే కూర్చుని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఇద్దరూ నవ్వుతూ కుశలప్రశ్నలు వేసుకున్నారు.
సీతారములను ఒక్కటి చేసిన తితిదే వేద పండితులు...
స్వామివారి కల్యాణాన్ని తితిదే వేద పండితులు రాజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతవును జరిపించారు. రాత్రి 9.30 గంటల సమయంలో శ్రీరాముడు, సీతమ్మ తలపై జీలకర్ర బెల్లం పెట్టడంతో కల్యాణ మూహుర్తం గడియ వచ్చినట్లు భావించి... మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు వేసుకొని... దండలు మార్చుకున్నారు. స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి దాదాపు లక్ష మంది భక్తులు హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు.
భక్తుల సంతృప్తి...
సీతారాముల కల్యాణ మహోత్సవం ఎలాంటి ఆటంకం లేకుండా... ప్రశాంతంగా ముగియడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాట్లపై సంతృప్తి చెందారు. భక్తులందరికీ తితిదే ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు అందజేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కడపలోనే రాత్రి బస చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై...రాయచూర్ పర్యటనకు వెళ్లనున్నారు.