ఈనెల 13 నుంచి ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను ఆపడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సమ్మె నోటీస్ ఇచ్చిన ఐక్యకార్యాచరణ సమితి నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది. ఈ రోజు ఉదయం 11గంటలకు సచివాలయంలో జరిగే చర్చలకు రావాలని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి.కృష్టబాబు సంఘాల నేతలను, ఆర్టీసీ ఉన్నతాదికారులను కోరారు.
27 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇవ్వగా..., కార్మికుల వేతన బకాయిల సవరణ చెల్లింపు వినతిని ఇప్పటికే పరిష్కరించారు. మిగిలిన 26 డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరుపనున్నారు. అద్దె బస్సుల పెంపు, కార్మికుల కుదింపు, నిర్ణయాలను ఉపసంహరించుకోవడం సహా కారుణ్య నియామకాలు చేపట్టడం, రెగ్యులర్ ఉద్యోగాల నియామకం, కార్మికుల పదవీవిరమణ వయస్సు 58నుంచి 60ఏళ్లకు పెంచడం తదితర డిమాండ్లు పరిష్కరించాల్సి ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం, నష్టాలను పూర్తిగా భరించడం, కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్థికసాయం, ఎంవీట్యాక్స్ మినహాయింపు తదితర డిమాండ్లను ప్రభుత్వపరంగా పరిష్కరించాల్సి ఉంది. వీటన్నింటిపై సమావేశంలో కార్మిక సంఘాలనేతలతో ప్రభుత్వం చర్చించనుంది.
ఇదీ చదవండి