తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి 2 వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకానికి జులై 15 నాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ పోస్టుల భర్తీని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు.
ప్రభుత్వ ఉద్యోగులే ..
అత్యంత పారదర్శక విధానంలో, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నియామకాన్ని చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాల్లో నియమించే వారందరూ... ప్రభుత్వ ఉద్యోగాలేనని స్పష్టం చేశారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అదనంగా మరో 10 మంది సచివాలయ ఉద్యోగులను నియమించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. వివిధ అర్హతలున్నవారిని పరిగణనలోకి తీసుకోవాలని, వారంతా తమకు నిర్ణయించిన ఏ పని అయినా చేయగలిగేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
వాటర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ
పంచాయతీల్లో మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా చేపట్టాలని, ఒక జిల్లాను యూనిట్‌గా తీసుకువాలని చెప్పారు. తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారు. కనీసం రాబోయే 30 సంవత్సరాల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్పొరేషన్ ప్రణాళికలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి : ప్రజావేదిక కూల్చివేతతోనే వైకాపా పతనం ప్రారంభం: చంద్రబాబు