ఉగాది నాటికి ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీ జరగాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచే విడతల వారీగా 25 లక్షల గృహాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అక్రమాలు చోటు చేసుకున్నందున రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇల్లులేని పేదలుండకూడదని అధికారులను ఆదేశించారు. గతంలో చదరపు అడుగు నిర్మాణం 1100 వ్యయం అయ్యేదాన్ని 2300కు పెంచి దోచేశారన్నారు.
పేదలపై భారం వేయటం సరికాదు
షీర్వాల్ టెక్నాలజీ పేరుతో పేదలపై భారం వేశారని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో చదరపు అడుగు 1100 అయ్యే దాన్ని 2200–2300కు పెంచి దోచేశారని వివరించారు. పేదలపై ప్రతి నెలా 3వేల రూపాయల భారం వేయటం సరికాదని వ్యాఖ్యానించారు. వారికి నష్టం రాకూడదని...20 ఏళ్లపాటు నెలానెలా కట్టే పరిస్థితి ఉండకూడదన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
రాజీ పడొద్దు
రివర్స్ టెండరింగ్ అంశానికి ఎక్కువ ప్రచారం కల్పించి ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేందుకు అర్హతను కూడా తగ్గిద్దామని తెలిపారు. నిర్మాణాల నాణ్యత, సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడొద్దని వివరించారు. కేంద్ర నిధుల్లో కోత పడకుండా సెక్ డేటాను సరిచేయటం రీసర్వే కోసం కూడా ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం వద్దు
లబ్ధిదారుడు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన పనిలేదని ఇళ్లు ఉచితంగా ఇద్దామని తెలిపారు. సాచురేషన్ విధానంలో ప్రతీ గ్రామంలో లబ్ధిదారులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. ప్రతి లబ్ధిదారునికీ 1.5 సెంట్లు చొప్పున పంపిణీ చేయాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పారదర్శకంగా కార్యక్రమం చేపడతామని లబ్దిదారులు, పింఛనుదారుల జాబితానూ గ్రామసచివాలయాల్లో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేదని ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు.