భానుడి భగభగలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వాతావరణం ఎలా ఉన్నా... చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, బాటసారులు బయటకు రాక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో దాతలు, సంస్థలు ముందుకు వచ్చి నగరంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ఎంతోమంది గొంతు తడుపుతూ.. వారి దాహార్తిని తీరుస్తున్నాయి.
మంచినీటి కోసం జేబులు ఖాళీ
నవ్యాంధ్రకు విజయవాడ కేంద్రంగా మారడంతో.... నగరానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. భారీ స్థాయిలో జనసందోహం ఉండే విజయవాడలో వేసవిలో మంచినీళ్ల కోసం కిరాణ దుకాణాల మెట్లు ఎక్కాల్సిందే. దీంతో కేవలం తాగునీళ్ల కోసమే జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది.
నగర వాసుల హర్షం..
వేసవి నేపథ్యంలో ఇటు నగరవాసులతో పాటు.... అటు వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారి కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు, సంఘాలు ముందుకు వచ్చి చలివేంద్రాలు నెలకొల్పుతున్నాయి. ఎండలో తిరిగి అలసిసొలసి గొంతెండిన వారికి చల్లటి శుద్ధిచేసిన మంచినీళ్ళు అందించి వారి దాహాన్ని తీరుస్తున్నాయి. కొన్ని చోట్ల మంచి నీళ్ళతో పాటు మజ్జిగ సైతం అందించి... బాటసారుల దాహం తీరుస్తున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తెలుపుతున్నారు.