ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై ప్రారంభించని పనుల్ని రద్దు చేయాలని ఆదేశించారు. 25 శాతం పనులు కాని ప్రాజెక్టుల విలువ నిర్ధరించాలని.. తదుపరి చెల్లింపులు చేయొద్దని పేర్కొన్నారు.
పనులతో అధిక భారం: సీఎస్
ఎఫ్ఆర్‌బీఎం పరిమితులు పట్టించుకోకుండా చేసిన పనులతో ఖజానాపై భారం పడిందని సీఎస్ సుబ్రమణ్యం తెలిపారు. ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజెక్టు పనుల్ని సమీక్షించాలన్నారు. దిగజారుతున్న ఆర్థిక వనరులు అనాలోచిత నిర్ణయాలను ఉదహరిస్తున్నాయని స్పష్టం చేశారు. పేదల సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన అందించటమే ప్రభుత్వ లక్ష్యమని.. శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సీఎస్ ఆదేశించారు. విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేయాలని వివరించారు. ధ్రువీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
ఐఏఎస్ అధికారుల బదిలీ
సీఎం కార్యాలయంలోని ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర సహా సాయిప్రసాద్, గిరిజా శంకర్, రాజమౌళిని బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని వారిని ఆదేశించారు. సీఎం అదనపు కార్యదర్శిగా ధనుంజయ్‌రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీగా ఉన్నారు. అలాగే సీఎం ఓఎస్డీగా పి.కృష్ణమోహన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.