అందరికీ 'పసుపు-కుంకుమ'
ప్రతి మహిళకూ.. పసుపు కుంకుమ పేరుతో నాలుగు విడతలుగా ప్రభుత్వంసాయం అందించింది. డ్వాక్రాలో సుమారు 95 లక్షల మంది మహిళలకు... ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఆర్థిక చేయూతనందించాలని సంకల్పించారు. 'పసుపు-కుంకుమ' పథకంలో భాగంగా... ఇప్పటికే రూ.10వేలు ఇచ్చిన చంద్రబాబు సర్కారు... స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు దాదాపు రూ.9,500 కోట్ల లబ్ధి చేకూర్చింది. వీరందరికి 3 విడతలుగా మరో 10 వేలు చెక్కుల రూపంలో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రతి మహిళ నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించాలనే ఉద్దేశంతో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి... ప్రోత్సహిస్తున్నారు. 6 లక్షల 56వేల 747 స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై రూ.2, 514 కోట్ల వడ్డీ మాఫీ చేశారు. గత నాలుగున్నరేళ్లలో 8.50 లక్షల మహిళా సంఘాలకు రూ. 63 వేల 283 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత తెదేపా ప్రభుత్వానిది. స్త్రీనిధి ద్వారా ఒక్కో సభ్యురాలికి గరిష్ఠంగా లక్ష రూపాయల వరకూ రుణాలు ఇస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాకా రూ.3 వేల కోట్ల రుణాలిచ్చారు. ఇవే కాకుండా బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో మహిళా సంఘానికి రూ.10 లక్షల వరకూ రుణాలు మంజూరు చేసింది.
జీతాల పెంపు...
రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 55వేల 607 అంగన్వాడీకేంద్రాలున్నాయి. మొత్తం 55వేల 607 అంగన్వాడీ టీచర్లు... 48 వేల 770 మంది ఆయాలు పని చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏటా రూ.228 కోట్లు ఖర్చు చేసి... 9 లక్షల 11 వేల చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అంగన్వాడీటీచర్లకు 2 దఫాలుగా వేతనం పెంచారు. టీచర్లకు రూ.4 వేల నుంచి రూ.10,500... ఆయాలకు రూ.2 వేల నుంచి 6 వేల వరకు పెంచారు.
అన్న అమృతహస్తం...
దళిత, గిరిజన, గర్భిణి, బాలింతల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో రోజూ రూ.16తో వేరుశనగ ముద్ద, రాగిజావ, పండ్లు ఇతర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 6 లక్షల 67 వేల 871 మంది మహిళలు, చిన్నారులు లబ్ధి పొందుతున్నారు.
అన్న అమృతహస్తం పథకం ద్వారా గర్భిణి, బాలింతలకు ఒక పూట భోజన సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అన్నంతోపాటు ఆకుకూరలు, పప్పు, కూరగాయలతో సాంబారు, గుడ్లు, 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నారు. ఈ పథకంలో 6 లక్షల 62 వేల మంది లబ్ధిపొందుతున్నారు. గ్రామీణ మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు నెలకు రూ. 33 కోట్లు ఖర్చు చేస్తోందీ ప్రభుత్వం.
సబల పథకం ద్వారా 11 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో 21 వేల మంది బాలికలు సాంత్వన పొందుతున్నారు. ఇందు కోసం ఏటా రూ.5.98 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. డ్వాక్రా మహిళలకు మొట్టమొదటిసారి 50శాతం రాయితీపై శానిటరీ నాప్కిన్లు అందించేందుకు రూ.127 కోట్లు కేటాయించింది చంద్రన్న సర్కారు.
పేదలకు పెళ్లి కానుక...
చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద... 66 వేల 538 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ ఆడపిల్లలకు రూ.269.17 కోట్లు ప్రభుత్వం అందించింది. ఆహారబుట్ట పథకం పేరిట ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది చంద్రన్న సర్కారు. పోషక విలువలున్న ఆహార పదార్ధాలను అందించనుంది. గిరిజన గర్భిణులు పోషకాహారం లేక రక్తహీనత, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్య సదుపాయాలూ అందుబాటులో లేక... ప్రసవ సమయంలోనే చాలామంది మరణిస్తున్నారు. ఈ సమస్య అధిగమించేందుకు... ఆహారబుట్ట పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది.
సాధికారితకు అధిక ప్రాధాన్యత...
ఇప్పుడే కాదు.. మొదటి నుంచి కూడా తెదేపా మహిళా సాధికారితకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలకు ఆస్తిహక్కులో వాటా.. విద్యాసంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. మహిళా విద్యకోసం.. తెదేపా హయాంలోనే ప్రత్యేక యూనివర్సిటీ నెలకొల్పారు. డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేశారు. ఇప్పుడు తాజాగా అందజేస్తున్న పసుపు - కుంకుమతో మహిళల్లో తెదేపా పట్ల ఎక్కువ సానుకూలత కనిపిస్తోంది. ఇది ఓట్ల రూపంలో తమకు బదిలీ అవుతుందని తెదేపా నమ్మకంతో ఉంది.