TDP ACTIVISTS PROTEST : శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేశారంటూ.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు నిరసనల హోరెత్తించారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడిని ఖండిస్తూ.. ఆయన నియోజకవర్గమైన ప్రకాశం జిల్లా కొండెపి, సింగరాయకొండ సహా పలు ప్రాంతాల్లో.. రాస్తారోకోలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కనిగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టంగుటూరులో ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసనలు: వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు.. మంచి బుద్ధి ప్రసాదించాలంటూ.. బాపట్ల జిల్లా చీరాలలో అంబేడ్కర్ విగ్రహానికి.. వినతి పత్రం అందించారు. పర్చూరు బొమ్మల కూడలిలో సీఎం జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అద్దంకి బంగళారోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
చిలకలూరిపేటలో బైక్ ర్యాలీ: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయంటూ..మంగళగిరిలో తెలుగుదేశం శ్రేణులు రాస్తారోకో చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయం ఎదుట.. నిరసన తెలిపారు. అచ్చంపేటలో టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో.. రోడ్డెక్కారు. చిలకలూరిపేటలో బైక్ ర్యాలీ చేసి.. నిరసన తెలిపారు. వినుకొండలో మాజీ MLA జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
బలభద్రపురంలో కొవ్వుత్తులతో నిరసన: తిరుపతి జిల్లా వెంకటగిరి, నాయుడుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. తెలుగుదేశం శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు నశించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో..ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
పీఎస్‌లో వైసీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు: మరోవైపు శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, బుచ్చయ్య చౌదరి పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసు, కారుమూరి నాగేశ్వర రావు, సుధాకర్‌బాబు, ఎలీజాపై ఫిర్యాదు చేశారు. శాసనసభలో జరిగిన సంఘటనపై విచారణ జరపాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించాలని కోరారు. ఫిర్యాదు చేసే ముందు తుళ్లూరు సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు రాజధాని రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
టీడీపీ కార్యాచరణ: జీవో నెంబర్ 1, డోలా బాలవీరాంజనేయస్వామిపై దాడి విషయమై తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ప్రకటించింది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నేతలకు అధినేత పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నారు.
ఇవీ చదవండి: