CM Jagan Bapatla Tour : బాపట్ల జిల్లా చుండూరు మండలంలో ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లు చేయడానికి జిల్లా అధికారులు నిధుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వ శాఖలోనూ మిగులు నిధులు లేకపోవడంతో ప్రతి మండలం నుంచి లక్ష చొప్పున సమీకరిస్తున్నారు. నగదు సేకరణను ఓ ప్రధానశాఖకు చెందిన జిల్లా అధికారికి అప్పగించారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి ఈనెల 21న చుండూరు మండలం యడ్లపల్లి ఏవీఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లకు, భోజన వసతి, కుర్చీలు, బారీకేడ్లు, వాహనాలకు లక్షల్లో నిధులు అవసరం. ఐతే బాపట్ల జిల్లా అధికారుల కార్యాలయాల్లో స్టేషనరీ కొనుగోలుకు నిధుల్లేవు. అధికారులు, ఉద్యోగులు సొంత సొమ్ముతో సమకూర్చుకుంటున్నారు.
నాలుగు నెలల క్రితం విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం రాగా.. అధికారులు అప్పుడూ ఇలానే నానా తంటాలు పడి చేతి చమురు వదిలించుకున్నారు. అయితే 21న సీఎం కార్యక్రమం కోసం మళ్లీ నిధులు సమీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వగా.. ఆదేశాలు సరే ఇప్పుడు తెచ్చేదెలా అని స్థానిక అధికారులు నసుగుతున్నారు. సీఎం వస్తున్నా మాపై బాదుడు తప్పదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: