Grain Merchant Attempted Suicide in Front of Police Station: పోలీస్ స్టేషన్ ఎదుటే ధాన్యం వ్యాపారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాపట్లలో కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. భర్తపూడికి చెందిన శ్రీనివాసరావు ఐదేళ్లుగా ధాన్య వ్యాపారం చేస్తున్నాడు. స్థానిక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాల వ్యాపారులకు విక్రయించేవాడు. అక్కడి గ్రామాల రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆరు నెలల క్రితం నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యాపారులు.. నిమ్మకాయల వెంకటేశ్వర్లు, మారం చిన్నరాగం రెడ్డికి విక్రయించాడు. వారి నుంచి 33 లక్షల రావాల్సి ఉండగా.. వారు విడతల వారీగా 18 లక్షల చెల్లించగా.. ఇంకా 15 లక్షలు రావాల్సి ఉంది.
శ్రీనివాసరావు మిగిలిన నగదు కోసం ఐదు నెలలుగా కావలి వెళ్లి వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదిగో అదిగో అంటూ వారు తిప్పుతున్నారు కాని డబ్బులు ఇవ్వడం లేదు. స్థానిక రైతులు తమకు రావలసిన ధాన్యం బకాయిల కోసం శ్రీనివాసరావుపై ఒత్తిడి పెంచగా.. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసరావు బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్కు వెళ్లి.. కావలి వ్యాపారులు ధాన్యం బకాయి సొమ్ము చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశాడు. ఇతర కేసుల్లో తీరిక లేకుండా ఉన్నామంటూ పోలీసులు స్పందించ కుండా కేసు నమోదు చేయలేదు. దీంతో వ్యాపారి బుధవారం మరోసారి స్టేషన్కి వెళ్లాడు.
అప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో శ్రీనివాసరావు మనస్థాపానికి గురై తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును స్టేషన్ ఎదుటే తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సిబ్బంది వెంటనే స్పందించి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాపట్ల గ్రామీణ సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి బాధిత వ్యాపారితో మాట్లాడి వివరాలు సేకరించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం పొన్నూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితుడుని కుటుంబ సభ్యులు తరలించారు.
శ్రీనివాసరావు భార్య అరుణ మాట్లాడుతూ.. కావలి వ్యాపారుల ధాన్యం తీసుకొని సొమ్ము ఇవ్వకుండా తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని.. రైతుల వద్ద పరువు పోతుందని ఎకరా భూమిని విక్రయించి ఐదు లక్షల బకాయిలు చెల్లించాముని తెలిపారు. రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించగా.. వారి నుంచి స్పందన లేకపోవడంతో తన భర్త స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడని.. ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసుల నుంచి సమాచారం రావడంతో ఆసుపత్రికి వచ్చామని శ్రీనివాసరావు భార్య తెలిపారు.