Women murder నెల్లూరులో దంపతుల దారుణ హత్య జరిగిన మరుసటి రోజే బాపట్ల జిల్లా చీరాలలో ఇలాంటి మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అతి కిరాతకంగా హతమార్చారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. చీరాల భావనారుషిపేటలో దంపతులు ఊట్ల విజయలక్ష్మి (55), మదనగోపాలమూర్తి నివసిస్తున్నారు. భర్త మదనగోపాలమూర్తి సోమవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ఇంటినుంచి బజారుకు వెళ్లి అరగంట తరువాత తిరిగివచ్చారు. లోపలికి వెళ్లేందుకు తలుపు కొట్టగా ఇంట్లోనుంచి గుర్తు తెలియని వ్యక్తి కంగారుగా పరిగెత్తుతూ వచ్చి మెట్లపైనుంచి పక్కింటి మీదుగా పరారయ్యాడు. వెంటనే మదనగోపాలమూర్తి లోపలకు వెళ్లి చూడగా భార్య రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలను తెప్పించారు. వారు సేకరించిన సీసీ ఫుటేజ్‌లో నీలంరంగు చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి హడావుడిగా పరుగెడుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి ప్రగడ కోటయ్య విగ్రహం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు మీదుగా రైల్వేస్టేషన్, బస్టాండ్ రోడ్డులో చేతిలో సంచితో పరుగెత్తాడు. ఈ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దొంగతనానికి వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడా?మరే కారణం ఉందా? అన్న కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపారు.
పథకం ప్రకారమే హత్య: అల్పాహారం తెచ్చేందుకు భర్త మదనగోపాలమూర్తి బజారుకు వెళ్లి వచ్చేలోగానే ఈ ఘాతుకం జరిగింది. దీంతో దుండగుడు పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. రెండంతస్తుల భవనంలో ఉంటున్న వీరు కింద దుకాణానికి అద్దెకిచ్చి పైఅంతస్తులో నివసిస్తున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న గృహిణి గొంతు నులిమి తలను నేలకు మోది చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితం ఒకరు మృతి చెందగా, మరొకరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలలుగా విజయలక్ష్మి తన కుమారుడి వద్ద ఉండి పది రోజుల కిందటే చీరాల వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: