ETV Bharat / state

Floods: అనంతపురాన్ని చుట్టుముట్టిన వరదలు.. - Floods

Extreme weather - heavy rainfall:అనావృష్టికి ఎదురొడ్డి బతుకుతున్న అనంతపురం జిల్లా ప్రజలను... వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని మృతనదులు కూడా రికార్డుస్థాయిలో ప్రవహిస్తూ... తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు అనంతపురంలో నడిమివంక సృష్టించిన బీభత్సం... నగర ప్రజల్ని భయకంపితులను చేసింది. ఆక్రమణలతో లోతట్టు కాలనీల్లోకి వరద చొచ్చుకెళ్లింది. మరో మూడు రోజులు కుండపోత తప్పదనే హెచ్చరికలతో... బాధిత ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

Colonies cut off  rain brings flash flood in Anantapur
అనంతపురం జిల్లాలో వరదలు
author img

By

Published : Oct 13, 2022, 9:58 AM IST

అనంతపురం జిల్లాలో వరదలు

Rains in Anantapur: మూడేళ్లుగా భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి అనంతపురం జిల్లాను వెంటాడుతున్నాయి. దశాబ్దాలుగా కరవుతో అల్లాడి, వర్షం కోసం ఎదురుచూసిన అనంతపురం ప్రజలకు... కుండపోత వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు పంటలు, ఆస్తులను తీవ్రంగా నష్టపరచగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వానలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగడంతో ప్రజలు భయకంపితులు అయ్యారు. ఈ కష్టాలను మరవక ముందే అనంతపురంలో నడిమివంక బీభత్సం సృష్టించింది.

వంక భూమిని ఆక్రమించి భవనాల నిర్మాణం: ఎన్నడూ కనీస ప్రవాహం కూడా రాని నడిమివంక.. ఈసారి జనావాసాలు, కాలనీల్లోకి చొచ్చుకొచ్చింది. కేవలం ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికే అనంతపురం గ్రామీణ మండలంలోని ఆలమూరు చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా నడిమివంక గుండా శింగనమల చెరువుకు వెళుతోంది. దశాబ్దాలుగా ప్రవాహం లేకపోవడంతో అక్రమార్కులు వంక భూమిని ఆక్రమించి భవనాలు నిర్మించారు. దీనివల్ల వరదనీరు వంకలోకి వెళ్లడానికి అవకాశం లేక కాలనీలను ముంచెత్తుతోంది. అనూహ్య వరదతో లోతట్టు కాలనీలు నిండా మునిగాయి.

అనంతపురం నగరం విస్తరణ ఎక్కవగా రుద్రంపేట వైపే ఉండటం, అక్కడ భూముల విలువలు పెరిగటంతో నడిమివంక పూర్తిగా ఆక్రమణకు గురైంది. 60 అడుగల వెడల్పు ఉండాల్సిన నడిమివంక అక్రమణకు గురై అనేక చోట్ల కేవలం ఎనిమిది అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. దీంతో భారీ వర్షంతో వచ్చిన వరద ప్రవాహం కాలనీలను ముంచెత్తడంతో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా వంకను ఆక్రమించిన నిర్మించిన ప్రహరీగోడను ప్రజలంతా కలిసి కూల్చేశారు.

విద్యుత్ సరఫరా నిలిపివేత: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 12 కాలనీలు, గ్రామీణ మండలం రుద్రంపేట పంచాయతీలోని 5 కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఈ 17 కాలనీలకు మంగళవారం మధ్యాహ్నం నుంచే విద్యుత్ సరఫరా నిలిపేయగా... బుధవారం రాత్రికి కూడా పునరుద్ధరించలేదు. మళ్లీ భారీ వర్షం కురవడం, మరో మూడు రోజుల పాటు వానలు వస్తాయనే హెచ్చరికలతో, విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు చెప్పారు.

''మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయనే హెచ్చరికలు ఉన్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్దరణ చేయటంలేదని విద్యుత్ అధికారులు చెప్పారు. రెండు రోజులుగా వేలాది మంది ముంపులోనే అంధకారంలో జీవిస్తున్నాం. తమను పరామర్శించటానికి ఒక్క అధికారి కూడా కాలనీల్లోకి రావటంలేదు''- కాలనీవాసులు

పునరావాస కేంద్రం: వరద ప్రవాహంతో ఇంట్లో సర్వస్వం పోగొట్టుకున్న ప్రజలకు నగరంలో ఆరు చోట్ల పునరావాసం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల వద్దకే భోజనం, తాగునీరు పంపుతున్నారు. అయితే బాధితులు కేవలం రంగస్వామి నగర్ పునరావాస కేంద్రంలో మాత్రమే తలదాటుకుంటూ, ఆహారం తీసుకుంటున్నారు. అక్కడ కేవలం వంద మంది మాత్రమే పనరావాసం పొందుతుండగా, మిగిలిన ఐదు కేంద్రాలకు బాధితులు ఎవరూ వెళ్లలేదు. ముంపునకు గురైన ఇంటిని వదిలేసి పునరావాస కేంద్రానికి వెళ్తే , ఇంట్లో వస్తువులను దొంగలు దోచుకెళ్తారని ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ బాధితులు ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పునరావాస కేంద్రాలకు వచ్చినవారికి మాత్రమే ఆహారం ఇచ్చే ఏర్పాటు చేయటంవల్ల, బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందటంలేదు.

మానవత్వాన్ని చాటుకున్న ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అమిలినేని: అనంతపురంలోని ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు అండగా నిలిచి రోజూ మధ్యాహ్నం, రాత్రి ఐదు వేల మంది ముంపు ప్రాంతంలో ఆహారం అందించటానికి తన సంస్థకు చెందిన 150 మంది సిబ్బందితో ముంపు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్నాయి. అనేక కాలనీల్లో వృద్ధులు, బాలింతలు, గర్భవతులు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సహాయం అవసరమైతే ముంపు కాలనీల నుంచి ఆసుపత్రికి వెళ్లే మార్గాలన్నీ నడిమివంక ప్రవాహంతో ఉధృతంగా దిగ్భంధంలో ఉన్నాయి.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.