BJP State President Somu Veerraju: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వైకాపా నేతలు.. అధికారం అడ్డంపెట్టుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లి వెళ్లిని సోము.. ఆ పార్టీ రాజంపేట అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. భాజపాను బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడానికి ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రాజు, రమేశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
'రాయలసీమలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైకాపా ప్రభుత్వం మాత్రం కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే దృష్టిసారించడం దురదృష్టకరం. జలశక్తి మిషన్ ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి కేంద్ర రూ.7 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 50 శాతం నిధులు ఇచ్చేందుకు కూడా ముందుకురాలేదు. త్వరలోనే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తాం' అని సోము వీర్రాజు అన్నారు.
ఇదీ చదవండి: సీపీఎస్ రద్దు కోరుతూ రేపు యూటీఎఫ్ 'చలో సీఎంవో'.. ముందస్తు అరెస్టులు