Young Man Service for Old People : ఉద్యోగ రీత్యా పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు.. కొవిడ్ లాక్‌డౌన్ కాలం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. చేతిలో డబ్బున్నా.. అవసరమైన సరకులు, ఔషధాలు తెచ్చుకోలేక ఎన్నో అవస్థలు పడ్డారు. అలాంటి వాళ్లందరికీ అండగా నిలవాలని భావించిన తాడిపత్రికి చెందిన కృష్ణా రెడ్డి.. నామమాత్రపు రుసుముతో కావాల్సిన వస్తువుల్ని ఇంటి దగ్గరకు చేరవేస్తున్నాడు. ఇందుకోసం "క్యారీ నౌ" అనే డెలివరీ సంస్థను ప్రారంభించాడు.
ఈ సంస్థ ప్రారంభించాలన్న ఆలోచనకు కారణం.. తన జీవితంలో జరిగిన విషాద సంఘటనే అంటున్నాడీ యువకుడు. కృష్ణా రెడ్డి ఓ మల్టీనేషనల్ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నాడు. కొడుకు అందుబాటులో లేకపోవడంతో అతని తండ్రి మహేశ్వరరెడ్డి మందుల కోసం తాడిపత్రికి వెళ్లి కొవిడ్ వైరస్ బారినపడ్డాడు. ఖరీదైన వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆ బాధ నుంచి పుట్టిందే క్యారీ నౌ డెలివరీ సంస్థ.
ఉద్యోగానికి రాజీనామా చేసిన కృష్ణారెడ్డి...స్నేహితుడు పరమేశ్‌తో కలిసి క్యారీ నౌ సంస్థను స్థాపించాడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా...వృద్ధులకు, పెద్ద వాళ్లకు చేదోడుగా నిలుస్తున్నాడు. ఔషధాలు అందించినందుకు కేవలం 1రూపాయి నామమాత్రపు రుసుం తీసుకుంటూ...గ్రామీణ వృద్ధులకు సాయం చేస్తున్నాడు.
గ్రామీణుల నుంచి వస్తున్న స్పందనతో... నిత్యావసరాలు, భోజనాన్నీ అందిస్తోంది...క్యారీ నౌ. ఇందుకు సేవా రుసుముగా.... సరకులకు 10 రూపాయలు, ఆహార డెలివరీలకు కిలోమీటర్‌కు 2 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వీరి సేవలు నచ్చడంతో వేరే రాష్ట్రాలు, దేశాల్లో ఉంటున్న వాళ్లు ఇంట్లో వాళ్లకు కావాల్సిన సామాగ్రీని క్యారీ నౌ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు.
తాడిపత్రి కేంద్రంగా పనిచేస్తున్న క్యారీ నౌ...ప్రస్తుతం చుట్టుపక్కల 130 గ్రామాల్లో తన సేవల్ని అందిస్తోంది. లాభాల కోసం కాక సేవా ప్రాతిపదికనే సేవలు అందిస్తుండడంతో ఒక్కో గ్రామంలో రోజుకు ఒక్కసారి మాత్రమే డెలివరీ చేస్తున్నారు. ఉదయం 11గంటల లోపు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే.. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి డెలివరీ చేస్తున్నారు. మెడిసిన్స్ మాత్రం 24 గంటల పాటు అందిస్తున్నారు ఈ యువకులు.
వీరి సేవల్ని గుర్తించి ఐటిసి సంస్థ తమ వంతు సహకారం అందిస్తోంది. పెద్ద సంస్థలకు అందిస్తున్నట్లుగా... టోకు ధరలకే తమ ఉత్పత్తులు క్యారీ నౌకు అందిస్తోంది. ఇలా.. అన్ని వైపుల నుంచి మంచి సహకారం అందడం, రోజురోజుకు ఆర్డర్లు పెరుగుతుండడంతో... కొంత మంది ఉద్యోగుల్ని నియమించుకుని సేవలందిస్తోంది... క్యారీ నౌ.
ప్రారంభం నుంచి చాన్నాళ్లు... సొంత డబ్బులతోనే సేవలందించారు ఈ యువకులు. ప్రసుతం డెలివరీ బాయ్స్ ఖర్చులు పోనూ.. కొంత మొత్తం సంస్థకు మిగులుతోందని చెబుతున్నారు. వీరి సేవల పట్ల గ్రామీణులూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది కాలంలోనే ఎక్కువ మందికి చేరువైన క్యారీ నౌ..2030 నాటికి దేశంలోని మరిన్ని గ్రామాల్లో సేవలందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చదవండి :
OLD WOMAN DONATION: వృద్దురాలి ఔదార్యం.. ఆస్పత్రికి రూ.3 కోట్ల విలువైన భూమి దానం