దేశంలో ప్రజా మోసపూరిత పాలన సాగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపశిల్పి జయంతి సందర్భంగా అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'ఆ రాజ్యాంగానికే ప్రమాదం'
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు.. ఆ రాజ్యాంగ మనుగడకే ప్రమాదం వాటిల్లేలా పాలన సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదల పెన్నిధి కాంగ్రెస్ అని, ప్రజలకు అండగా ఉంటుందని శైలజానాథ్ స్పష్టం చేశారు.
'రాహుల్ నాయకత్వంలో...'
రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలతో కలిసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో భాజపాకి తొత్తుగా జగన్ ప్రభుత్వం నడుచుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.