అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురుమాను తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ఆకతాయి అడవికి నిప్పు పెట్టాడు. ఆ మంటల్లో ద్విచక్ర వాహనంతో పాటు 25 గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి.
నల్లగుట్ట తండాకు చెందిన గొర్రెల కాపరులు రమణ నాయక్, లక్ష్మీ నాయక్ చిగురుమానుతండా సమీప అడవిలో గొర్రెల మందని ఏర్పాటుచేసుకుని అక్కడే ఉంటున్నారు. కాపరులు పగటిపూట గొర్రెలను మేతకోసం అడవికి తోలుకెళ్లారు. ఆ సమయంలో 25 గొర్రెపిల్లలను మందలోనే వదలి వెళ్లారు. తండా సమీపంలో ఓ దుండగుడు పెట్టిన నిప్పువల్ల..అందులోని గొర్రెపిల్లలన్నీ సజీవదహనమయ్యాయి.
విషయం తెలుసుకున్న గొర్రెల కాపరుల కుటుంబీకులు బూడిదిగా మారిన గొర్రె పిల్లలు చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ ఆరు నెలల కష్టం అగ్ని ప్రమాదం రూపంలో దహనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తాహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి. ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. హత్యాయత్నం