అనంతపురం జిల్లాలోని చెన్నకేశవ స్వామి ఆలయ గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ఆలయ గోపురంపై దాడి జరిగినట్లు గుర్తించిన ఆలయ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
భాజపా నేతల ధర్నా..
పాతూరులోని చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అనంతపురంలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్నా కానీ ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఆలయంలో నిత్యం దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందుత్వ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం హిందుత్వ దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమని భాజపా నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండీ: భవిష్యత్తులో నీటి కొరత తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం..!