Payyavula Keshav Comments On YCP: వైసీపీ నాయకులు చేయాల్సింది రాయలసీమ గర్జన కాదని,.. దిల్లీలో గర్జన చేసి చూపాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. కర్నూలులో వైసీపీ నిర్వహించిన సీమ గర్జనపై మీడియా సమావేశం నిర్వహించిన పయ్యావుల కేశవ్.. వేదికపై ఆ పార్టీ నాయకుల హడావుడి తప్ప, కింద జనం లేరని విమర్శించారు. గేట్లు మూసి జనాన్ని ఆపాలని చూసినా.. గేట్లు తోసేసుకుంటూ ప్రజలు వెలుపలికి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడిందంటే ఈపాటికే వైసీపీ నాయకులకు అర్థమయ్యే ఉంటుందన్నారు. రాయలసీమలో మూడు సీట్లు మినహా అన్నిచోట్లా వైసీపీని గెలిపిస్తే, సీమకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు.
హైకోర్టును కర్నూలులో పెడతామంటే మిమ్మల్ని అడ్డుకున్నదెవరు..? మూడున్నరేళ్లలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్నారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన నిధులను సైతం కాజేసింది మీరంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఇస్తేనే రాయలసీమ అభివృద్ధి సాధ్యం, వీటిలో ఏ ఒక్కటైనా సాధించారా అంటూ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాయలసీమను అభివృద్ధి చేయని సీమ ద్రోహులు మీరంటూ ఆయన ద్వజమెత్తారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే,.. మీటింగ్ పెట్టుకొని ఎంతో చేశామని చెబుతుంటే వింటున్న ప్రజలు అమాయకులు కాదని ఆయన అన్నారు. రాయలసీమలో ఒక్క పరిశ్రమనైనా తీసుకరాగలిగారా అన్నారు. రాయలసీమలో చంద్రబాబు పట్టిసీమ ప్రాజక్టును ఎందుకు కట్టలేదని వైసీపీ నాయకులు వేదికమీద మాట్లాడుతున్నారంటే,.. వీళ్లకు ఏపాటి అవగాహన ఉందో తెలుస్తోందన్నారు.
ఇవీ చదవండి: