Software Employee Made an Idol of Ganesha with Chocolates: వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలు వినియోగించాలని పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. కొంతమంది వ్యక్తులు తమదైన శైలిలో చాక్లెట్లు, డ్రైఫ్రూట్స్‌తో వినాయకుని విగ్రహాలను తయారు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Anantapur District: పర్యావరణానికి అనుకూలంగా విభిన్నంగా చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయక తయారు చేశాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన నాగతేజ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నాగతేజ ప్రతీ సంవత్సరంలాగే.. ఈ సంవత్సరం కూడా పర్యావరణానికి హాని కలగకుండా వినాయకుడి విగ్రహాలను తయారు చేసాడు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వైరైటీగా చిన్నపిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో.. వినాయకుడి తయారు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ విగ్రహాన్ని తయారు చేయటానికి రూ 20 వేలు ఖర్చయ్యిందని తెలిపాడు. నిమిజ్జనం రోజున ఈ చాక్లెట్లను భక్తులకు పంచుతామని నాగతేజ తెలిపాడు. ఉరవకొండ పట్టణంలో నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ వెంకట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
Visakhapatnam: ప్రకృతికి హాని కలగని మట్టి, పసుపు, పిండి, ఆకులు, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన వివిధ రూపాల వినాయక విగ్రహాలు విశాఖలోని శ్రీప్రకాష్ పాఠశాలలో కొలువుదీరాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో పలువురు వినూత్నంగా ఆలోచించి వినాయక ప్రతిమలను తయారు చేశారు. వాటిలో కొన్ని కేవలం పసుపు వినియోగించి చేసినవి, కొన్ని మట్టి వినియోగించి, మరికొన్ని కాయగూరలు, ఆకులు, డ్రైఫ్రూట్స్‌తో చేసినవి ఉన్నాయి. విద్యార్థుల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన పెంపొందించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Dr. BR Ambedkar Konaseema District: పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ నీటిలో కరిగిపోయే మట్టి వినాయకుడి ప్రతిమలను పూజించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని మానేపల్లి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ముందుగా వివిధ రకాల ఆకృతులలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. మట్టితోనే కాకుండా మైదాపిండి ఇతర రకాల పదార్థాలతో నీటిలో సునాయాసంగా కరిగిపోయే విధంగా వినాయకుడి ప్రతిమలు తయారుచేసి గ్రామంలో ప్రజలకు విద్యార్థులు అందించారు.
NTR District: ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ గాంధీ సెంటర్లో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 7 రకాల విత్తనాలతో కలిపి తయారు చేసిన 2700 మట్టి వినాయక విగ్రహాలను ఏసిపి కె జనార్ధన్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎంతో శ్రమ ఉంటుంది.. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించడం ఎంతో అభినందనీయం అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని , పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఈ విగ్రహాలలో విత్తనాలు ఉన్నాయని గ్రహించి పవిత్రంగా నిమజ్జనం చేయాలని అన్నారు.
Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా ముకాసా మామిడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీఎన్జీసీ ఆధ్వర్యంలో విద్యార్థులు అందరూ మట్టి గణపతి తయారు చేశారు. మరియు వినాయక చవితి రోజు తప్పనిసరిగా మట్టి గణపతిని పూజిస్తామని ప్రతిజ్ఞ చేశారు.