సైబీరియన్కు చెందిన పక్షులు తమ సంతానోత్పత్తికి వేళ కిలోమీటర్లు ప్రయాణించి అనంతపురం జిల్లా వీరాపురానికి ప్రతి ఏడాది వస్తుంటాయి. ఇంద్రధనుస్సు వర్ణాలతో మెరిసే ఈ పక్షులను పెయింట్ స్టార్క్గా పిలుస్తుంటారు. జనవరిలో వచ్చి ఆగస్టులో పిల్లలను వెంట తీసుకొని స్వదేశానికి ఎగిరిపోయే వీటి జీవన విధానం విచిత్రంగా ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏడాది ఇక్కడికి వస్తున్న ఈ పక్షులు... ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇవి దేశీయ పక్షుల తరహాలో గింజలు, చిన్న పురుగులను తినవు.. కేవలం చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఒకప్పుడు నీటితో కళకళలాడే చిలమత్తూరు... ప్రస్తుతం కరవు కోరల్లో చిక్కుకున్నందున ఇక్కడికి వచ్చే పక్షులు ఆహారం లేక అలమటిస్తున్నాయి.
వేటకు వందల కిలోమీటర్లు
వీరాపురానికి వచ్చిన విదేశీ పక్షులు.... తమ పిల్ల పక్షులకు ఆహారం తెచ్చిపెట్టలేక సతమతమవుతున్నాయి. అనంతపురం జిల్లా గొల్లపల్లి జలాశయంలో నీరు ఉన్నందున ఆహార వేట కోసం అక్కడికి వెళ్లాలంటే రోజూ 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయి. అక్కడ కూడా చేపల లభ్యత తక్కువగా ఉన్నందున రోజంతా వేటాడితే ఒకటి.. రెండు చేపలు మాత్రమే లభిస్తున్నాయి. తల్లి పక్షులు తెచ్చే ఆహారం సరిపోక పిల్ల పక్షులు ఆకలితో రాత్రంగా అరుస్తూనే ఉంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రకృతికి ఎదురీదీ జీవనం సాగిస్తున్న ఈ పక్షులు ఆహారం, నీరు పొందడానికి పడుతున్న తీరు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు వీరాపురం గ్రామంలో చెట్లు అంతరించిపోతున్నందున.. సైబీరియన్ పక్షులు సమీపంలోని వెంకటాపురం గ్రామానికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో చిత్తశుద్ధిగా పనిచేస్తే ఈ పక్షులు సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. పెద్దఎత్తున చెట్లను పెంచి, వీరాపురం చెరువుకు హంద్రీనీవా నీటిని మళ్లిస్తే సైబీరియన్ పక్షులకు ఆయా గ్రామాలు చక్కటి శాశ్వత విడిదిగా మారనున్నాయి. ఈ ప్రాంతం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.