అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన స్వచ్ఛభారత్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పదకొండు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలంటూ... పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. తమ గోడు పట్టించుకునే వారే లేరంటూ వాపోయారు. తాము విధుల్లోకి చేరినప్పటి నుంచి రెండు నెలల జీతాలు మాత్రమే ఇచ్చారన్నారు. సంక్రాంతి పండుగ రోజైన జీతాలు ఇస్తారనుకుంటే బడ్జెట్ లేదంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబాలకు సంవత్సరాల కాలంగా జీతాలు ఇవ్వకపోయినా... కష్టాలను ఓర్చుకుని విధులు నిర్వర్తిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన వాటిని పైఅధికారులకు పంపించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా తాము పడే కష్టాన్ని చూసి తమకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.
ఇదీ చూడండి: 'తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవాలని ధర్నా'