State Government Gears UP To Meet Increasing Power Demand : ఇంకా మార్చి నెల రానే రాలేదు ఎండలు దంచికొడుతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎండాకాలం రాకముందే విద్యుత్ వినియోగం అప్పుడే పెరిగిపోయింది. వేసవిలో విద్యుతు కోతలు లేకుండా చూసేందుకు ఇంధన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
రాష్ట్రంలో ఫిబ్రవరి మూడో వారానికే విద్యుత్ డిమాండ్ 242.35 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఆరంభంలోనే డిమాండ్ సర్దుబాటు కోసం నిత్యం 10 ఎంయూల విద్యుత్‌ను మార్కెట్‌లో డిస్కంలు కొనాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సారి వినియోగం సుమారు 9 ఎంయూలు పెరిగిందని అధికారులు తెలుపుతున్నారు. గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ ఫిబ్రవరిలో 12,652 మెగావాట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది గ్రిడ్ డిమాండ్ గరిష్ఠంగా 13,347 మెగావాట్లుగా రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఏఐ అంచనాలో తేలింది.
ఇదిలా ఉండగా ఈ నెల 17న విద్యుత్ వినియోగం 12,726 మెగావాట్లుగా నమోదైంది. వచ్చే మూడు నెలల్లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 259 ఎంయూలకు చేరే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి కంటే విద్యుత్ వినియోగం సుమారు 4 శాతం అదనంగా ఉంటోంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందాల ప్రకారం 230 ఎంయూల వరకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సరఫరా చేసే అవకాశం ఉంది. అదనంగా పెరిగే 30 ఎంయూలను వివిధ మార్గాల్లో సమకూర్చుకుంటున్నారు.
స్వల్పకాలిక ఒప్పందాల కింద 400 మెగావాట్ల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది. హిందుజా థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో యూనిట్‌నూ ఉత్పత్తిలోకి తెచ్చేందుకు వీలుగా కోల్ ఇండియా నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాన్ని సంస్థ కుదుర్చుకుంది. దీంతో మరో 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. స్వాపింగ్ ద్వారా హరియాణా, పంజాబ్‌ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. డిస్కంలు సెంబ్‌కార్ప్‌తో 625 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ కరెంటు అందుబాటులోకి రానుంది.
ఈ ఏడాది డిమాండ్ అధికమే - ఏఐ ఆధారంగా ఇంధన శాఖ అంచనా
విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న తీరు ఇలా ఉంది (గత వారం) | |
---|---|
తేదీ | డిమాండ్ (ఎంయూల్లో) |
16-02-2025 | 234.27 |
17-02-2025 | 238.43 |
18-02-2025 | 240.92 |
19-02-2025 | 240.48 |
20-02-2025 | 241.34 |
21-02-2025 | 242.66 |
22-02-2025 | 242.35 |