Sathya sai drinking water scheme:అనంతపురం జిల్లాలో సుమారు 600 గ్రామాల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీటి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిధుల లేమితో పథకం నిర్వహణ భారంగా మారింది. ఇందులో పనిచేస్తున్న 572 మంది కార్మికులకు ఏడు నెలలుగా రూ.10 కోట్ల వరకు జీతాలు అందాల్సి ఉంది. బకాయిలు పెరిగిపోయి నిర్వహణ పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే మెటీరియల్ సరఫరా చేస్తామని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. పంచాయతీ ఖాతాల్లో నిధులు సర్పంచులు మరమ్మతులు కూడా చేపట్టలేకపోతున్నారు. విద్యుత్తు బకాయిలు మోయలేని భారంగా మారాయి. బిల్లులు చెల్లించకపోవడంతో బోర్డు ప్రధాన కార్యాలయానికి సరఫరా నిలిపేసిన సందర్భాలూ ఉన్నాయి.
ఎల్‌అండ్‌టీ నిష్క్రమణతో కష్టాలు
తీవ్ర దుర్బిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లా వాసుల తాగునీటి ఇక్కట్లను తీర్చాలనే లక్ష్యంతో సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో 1996లో రూ.380 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ తాగునీటి పథకం 11 లక్షల మంది దాహార్తి తీరుస్తోంది. 1998లో ప్రభుత్వం ఈ పథకం నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించింది. కార్మికుల జీతాలు, మరమ్మతులకు నెలకు రూ.2 కోట్ల వరకు ఖర్చు వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో ఈ పథకం నిర్వహణ నుంచి గత ఏడాది జూన్‌లో ఆ సంస్థ తప్పుకొంది. అప్పట్నుంచి సత్యసాయి తాగునీటి పథకం బోర్డు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. జులై నుంచి నవంబరు వరకు సంబంధించిన సమర్పించిన కార్మికుల జీతాల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. పీఎఫ్ కూడా జమ చేయలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరో సంస్థకు పనులు అప్పగించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు మూడుసార్లు టెండర్లు పిలిచారు. మొదటిసారి ఒక బిడ్ దాఖలు కాగా అర్హత లేదని తిరస్కరించారు. మిగతా రెండుసార్లు ఎవరూ స్పందించలేదు. నాలుగోసారి టెండర్లు పిలవడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. దీనిపై జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటరమణను వివరణ కోరగా సామర్థ్యం ఉన్నవారికే బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం నిర్వహణను ప్రభుత్వం తిరిగి సత్యసాయి ట్రస్టుకు అప్పగించాలని కార్మికులు డిమాండు చేస్తున్నారు.
ఇదీ చదవండి: CM YS Jagan: 'సబ్జెక్టుల వారీగా.. బోధనా సిబ్బందిని నియమించాలి'