రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. వ్యవసాయశాఖ అధికారులకు తగిన సూచనలు చేసి, ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రైతులను చెప్పులరిగేలా తమ కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పేరుతో 13వేల500 రూపాయలను అన్నదాతల బ్యాంకు ఖాతాలకు జమచేస్తోంది.
అనంతపురం జిల్లాలో ఎనిమిది లక్షల 19వేల భూమి ఖాతాలుండగా, ఈ పథకంతో ఐదు లక్షల 34 వేల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. మరో యాబై వేల మందికి పైగా రైతులు అర్హులు ఉన్నప్పటికీ సాంకేతికంగా సమస్యలు తలెత్తడంతో ఆర్థిక సహాయం ఖాతాలకు చేరలేదు. బ్యాంకుకు వెళితే మాదేమి లేదు వ్యవసాయ శాఖ కార్యాలయంలో అడిగండి అంటూ బ్యాంకు వారు... మా పని అయిపోయింది బ్యాంకుకు వెళ్లండి అంటూ వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు.
గ్రామ స్థాయి నుంచి వ్యవసాయశాఖకు ఎంపీఈఓలు, ఏఈఓల వ్యవస్థ బలంగా ఉంది. గ్రామ స్థాయిలో పనిచేసే ఈ అధికారులు ఎక్కడికక్కడ ఒక్కరోజు కేటాయించి, ప్రయోజనం అందని రైతుల సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించే వీలుంది. అయితే వీరంతా మండల కేంద్రంలో కూర్చొని గ్రామాల నుంచి రైతులను తిప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు రైతులు పనులు లేక వలస వెళ్లటంతో, ప్రజా సాధికార సర్వేలో పేర్లు నమోదు చేసుకోలేకపోయారు. నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా లబ్ది చేకూర్చామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంకా ముప్పై వేల మంది వరకు అర్హులు ఉన్నారని... వారికి వారం రోజుల్లో ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు భరోసా అర్హులందరికీ అందాలంటే మండల వ్యవసాయ అధికారులు మరికొంత బాధ్యత తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి