అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్న జలాలపురం సమీపంలోని అడవిలో వెలసిన గంపమల్లయ్య స్వామి.. 3 రాష్ట్రాల్లోని భక్తులకు కొంగుబంగారం. జలాలపురం నుంచి అటవీ మార్గంలో గుట్టలు దాటుకుంటూ 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఓ పెద్ద కొండ వస్తుంది. దాని నుంచి 40 అడుగులు లోపలికెళ్తే ఓ గుహలో.. గంపమల్లయ్య స్వామి ఉంటాడు. పూజారి పాపయ్య స్వామి కుటుంబం.. ఏళ్లుగా ఈ దేవుడి సేవలో తరిస్తోంది. ఏటా శ్రావణ శనివారాల్లో ఇక్కడ పెద్ద వేడుక జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి తరలివచ్చే భక్తులు సమర్పించే.. పూజా ద్రవ్యాలు, నైవేద్యాన్ని గుహలోకి తీసుకెళ్లి పూజారి పాపయ్యస్వామి దేవుడికి నివేదిస్తారు. ఈ సారీ అదే ప్రయత్నాల్లో పట్టుతప్పారు. కొండ దిగి గుహలోకి వెళ్లే క్రమంలో.. కాలు జారి 40 అడుగుల లోయలో పడిపోయారు.
భక్తులు చూస్తూ ఉండగానే.. బండరాళ్ల మీద నుంచి దొర్లుకుంటూ పూజారి పాపయ్య కిందపడ్డారు. అంతలోనే పాపయ్య ప్రాణం అనంతలోకాల్లో కలిసిపోయింది. అప్పటి దాకా సంబరంగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా మూగబోయింది. ఈ హఠాత్ పరిణామంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. ఏం జరిగిందోనంటూ కొండ కిందికి పరిగెత్తారు. వారెళ్లి చూసేసరికి.. పాపయ్య విగతజీవిగా పడి ఉన్నారు. మృతదేహాన్ని చూసి పాపయ్య బంధువులు బోరున విలపించారు. గత శనివారం పూజారి పాపయ్య.. గుహలో నుంచి పైకి రావటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పూజలో పాల్గొన్న నాదస్వరం బృంద సభ్యులు తెలిపారు. వయసు పైబడటంతో పట్టుసడలి ఉండొచ్చని అంటున్నారు.
ఇదీ చదవండి:
Ramya Murder Case: ఈ నెల 24న రాష్ట్రానికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం