Padayatra: రైతు సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపడితే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పోలీసులను పెట్టి అడుగడుగునా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత.. 'రైతుల కోసం తెలుగుదేశం' పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గాండ్లపర్తి నుంచి రాప్తాడు వరకు 15 కిలోమీటర్లు రైతులతో కలిసి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు రైతులు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక.. పోలీసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రైతు సమస్యలపై యాత్ర చేపడితే టీడీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు రాకుండా 250 మంది పోలీసులను పెట్టి బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రజలకు మేలు చేసి వుంటే ఇంతగా భయం ఎందుకని పరిటాల సునీత ప్రశ్నించారు. కుల రాజకీయాలు చేయడం మానేసి.. రైతులకు న్యాయం చేసేలా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఓటు వేయడం మా నియోజకవర్గానికి ఖర్మరా అని ప్రజలంతా బాధపడుతున్నారని అన్నారు. ఎడారిలాంటి అనంతపురానికి గతంలో నీరు తెచ్చిన ఘనత టీడీపీకి ఉందన్నారు. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టాలని పరిటాల సునీత కోరారు.
ఇవీ చదవండి: