అనంతపురం జిల్లా బొమ్మనహల్ వద్ద ఆంధ్ర సరిహద్దులోని హెచ్ఎల్సీలో తుంగభద్ర జలాలకు స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగభద్రమ్మకు రామచంద్రారెడ్డితో పాటు.. రైతులు, ప్రజలు, వైకాపా నాయకులతో కలిసి సారే, పూలు, పసుపు, కుంకుమ సమర్పించి పూర్ణకుంభంతో విశేష పూజాది కార్యక్రమాలు చేశారు. రైతులు తమ పంట పొలాలు సమృద్ధిగా పండాలని గంగా మాతను వేడుకున్నారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రామచంద్రారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు. తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు చేరడం వల్ల నేడు, రేపు పూర్తిస్థాయిలో నిండు తుందన్నారు. తుంగభద్ర జలాలు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల ప్రజల తాగు ,సాగు నీరందించే వరప్రదాయినిగా ఆయన పేర్కొన్నారు . టీబీ డ్యాం నుంచి హెచ్ ఎల్ సి ద్వారా వచ్చే నీటితో అనంతపురం జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో రైతులు పంటను సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. తుంగభద్ర జలాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని గంగా మాత వేడుకున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు ...సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేశాం!