పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం అలముకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. షాహిదా బేగం (19), రఘు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి నిశ్చయించారు. దీంతో, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
రఘు పురుగుల మందు తాగినా, యువతి తాగలేదు. ఆస్పత్రి పాలైన రఘు కోలుకున్న తర్వాత మళ్లీ ఆమెను కలిశాడు. ఆత్మహత్యకు సహకరించకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమవుతోందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ నెల 17న రాత్రి సమయంలో మాట్లాడాలని ఆమెను నమ్మించి ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో రఘు ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. యువతి తల్లిదండ్రులు అతడిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు.
యువకుడిపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 19న యువతి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. విచారణలో రఘు తెలిపిన వివరాల మేరకు మంగళవారం కళ్యాణదుర్గం గ్రామీణ సీఐ శివశంకర్ నాయక్, ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందితో కలిసి కణేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి షాహిదా బేగంగా నిర్ధారించారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి...