Stormy Winds in AP: రాష్ట్రంలో ఉక్కపోతలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తా ఉపశమనం లభించినట్లైంది. ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లగా ఉండటంతో ఎండ వేడి నుంచి ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
పిడుగులు పడి ఇద్దరు మృతి: అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వరుసకు అన్నదమ్ములైన వడ్డే బాలకృష్ణ(35), వడ్డే గౌరీ శంకర్(20), తరుణ్ కుమార్ (10)లు.. కూలీలతో కలిసి తోట దగ్గరకు వెళ్లారు. సాయంత్రం వేళ వర్షం మొదలు కావడంతో వారు అక్కడి దగ్గరలోని చెట్టు కిందికి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడడంతో బాలకృష్ణ, గౌరీ శంకర్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
భారీ ఈదురు గాలులతో నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు: నెల్లూరు జిల్లా చేజర్ల పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీగా వీచిన ఈదురు గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు నేల కూలాయి. చేజర్ల- తిమ్మాయిపాలెం మార్గమధ్యలో రహదారి పై విద్యుత్ స్తంభం కూలడం, ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చేజర్ల-కలువాయి మార్గమధ్యలో తాటి చెట్టు రహదారి మీద పడటంతో రెండు చోట్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలపై కూలటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
భారీ ఈదురుగాలులుతో నేల రాలిన విద్యుత్ వైర్లు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చుట్టుపక్కల ఏరియాలలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకి పలు కాలనీలో చెట్లు, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. జైపూర్ రోడ్లో రెండు షాపులపై చెట్లు కూలి బంగారమ్మ కాలనీలో చెట్లు, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాయంత్రం ఒక అరగంట సేపు విపరీతమైన ఈదురు గాలులకి విద్యుత్ వైర్లు కూడా తెగిపడి సాలూరులో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు సరి చేయడానికి సమయం పడుతుందని.. కరెంటు ఇవ్వడం లేట్ అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అ దీంతో ఎండల తీవ్రతకు ఉక్కపోతకు గురైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది.
ఈదురుగాలులు, వర్ష బీభత్సం: కాకినాడ నుంచి కొవ్వూరు వరకు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. అంతలోనే ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులు వీచాయి. గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలులు ఆపైన సుమారు గంటపాటు వర్షం.. దీంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామర్లకోటలో ట్రాక్‌పై స్తంభాలు నేలకొరగడంతో మూడు రైళ్లు దాదాపు రెండు గంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఈదురుగాలులకు విద్యుత్తు తీగలపై చెట్లు పడి 35 స్తంభాల వరకు నేలకొరిగాయి. కాకినాడ జిల్లాలో భారీ చెట్లు రెండు కార్లపై పడడంతో నుజ్జునుజ్జయ్యాయి.