HEAVY FLOODS IN ANANTAPUR : అనంతపురం నగరంలో నడిమివంక ఉద్ధృతి కారణంగా.. మంగళవారం అర్ధరాత్రి నుంచి జలదిగ్బంధంలో ఉన్న దాదాపు 20 కాలనీలు.. ఇప్పటికీ వరద గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. చుట్టుపక్కల చెరువుల నుంచి పెద్ద ఎత్తున వరద నడిమివంకలోకి చేరుతుండటంతో.. నగరంలోని లక్ష్మీనగర్, ఆజాద్‌నగర్, సీపీఐ కాలనీ, నాలుగు, ఐదు, ఆరు రోడ్లు, రంగస్వామినగర్, సోమనాథ్ నగర్, శాంతినగర్, భగత్‌సింగ్ నగర్, రజకనగర్, గౌరవ గార్డెన్స్ కాలనీలతో పాటు.. రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబుకొట్టాల, చైతన్య కాలనీ, విశ్వశాంతినగర్, కక్కలపల్లి కాలనీ, జాకీర్ కొట్టాల ముంపులోనే ఉన్నాయి.
అనంతపురం గ్రామీణ మండలంలోని కాటిగాని కాలువ చెరువుకు.. ఎగువ నుంచి భారీ వరద రావడంతో.. చెరువు కట్టపై నుంచి నీరు పొంగి పొర్లి కాటిగానికాలువ గ్రామంలోకి ప్రవేశించాయి. గ్రామస్థులు మట్టితోడే యంత్రాలు తీసుకెళ్లి చెరువు మరవ కట్టను తొలగించారు. ఆ చెరువు నుంచి భారీ వరద కక్కలపల్లి చెరువుకు, అక్కడి నుంచి నడిమనివంక ద్వారా అనంతపురం నగరంలోకి వస్తుండటంతో నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోయింది.
రామస్వామినగర్‌లో ప్రమాద స్థాయిలో నడిమివంక ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాలనీల్లో దాదాపు ఆరు అడుగులు దాటి వరద ముంచెత్తింది. రంగస్వామినగర్ నాలుగో రోడ్డు, ఐదో రోడ్ల కాలనీల్లో ఇళ్లన్నీ నీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని కిరాణ, వస్త్ర దుకాణాల్లోకి వరద నీరు చేరాయి. దాదాపు రెండు రోజులుగా నీటిలోనే ఇళ్లన్నీ నానుతుండటంతో.. కొన్ని ప్రమాదకర స్థాయికి చేరాయని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద వల్ల పది ఇళ్లకుపైగా కూలిపోయాయని చెబుతున్నారు.
వరద ముంపు క్రమక్రమంగా పెరగడంతో.. విపత్తుల నిర్వహణ బృందాలు ఇళ్లలోనే ఉండిపోయిన బాధితులను తరలించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దొంగల భయం కారణంగా కొందరు బాధితులు ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. వరదలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ముంపు బాధితుల కోసం 6 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓ పునరావాస శిబిరం వద్ద కూడా వరద ప్రవాహం చేరడంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
నగరంలోని 3వ రోడ్డులో జీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. కలెక్టర్ శిబిరానికి వెళ్లగానే అక్కడ తలదాచుకుంటున్న బాధితులు తమ కష్టాన్ని ఏకరవు పెట్టారు. ఇంట్లోకి వరదనీరు ప్రవేశించటంతో సర్వస్వం కోల్పోయామని కన్నీరు పెట్టారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ నాగలక్ష్మి బాధితులకు హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాంలో సౌకర్యాలు మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్పలు.. అనంతపురం నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
ఇవీ చదవండి: