రైతుభరోసా కేంద్రాల సేవల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికే ఏపీ మార్క్‌ఫెడ్ పరిమితమవగా.. రానున్న ఖరీఫ్ నుంచి ఆర్బీకేల్లో ఎరువుల విక్రయానికి వ్యవసాయశాఖ అనుమతిచ్చింది. ఎరువుల బస్తాపై ముద్రించిన గరిష్ట ధర కంటే 10 నుంచి 25 రూపాయల తక్కువకే విక్రయించనున్నారు. గత ఖరీఫ్‌లో ఆర్బీకేల్లో సొమ్ము చెల్లించిన రైతులకు ఎరువులు సరఫరా చెయ్యడంలో వ్యవసాయశాఖ విఫలమైంది.
ఆ అనుభవంతో.. ఆర్బీకే సేవల్లో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రతి వ్యవసాయ డివిజన్‌లోనూ ఉత్పాదకాల నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆర్బీకేలకు రవాణా చేసేలా ప్రణాళిక చేశారు. ఇప్పటివరకూ ఎరువులు, పురుగుల మందుల కోసం రైతులు డబ్బులు చెల్లించి రెండుమూడు రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. ఇకపై గ్రామస్థాయిలోనే ఆర్బీకే గోదాముల్లో రైతులు ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే పద్ధతి తెచ్చారు. మార్క్‌ఫెడ్‌కు ఇప్పటివరకూ జిల్లాస్థాయిలో ఒక మేనేజర్ ఉండగా.. తాజాగా ఇద్దరు మేనేజర్‌లు వచ్చారు.
ఎరువులు ఇతర ఉత్పాదకాల నిల్వ, సరఫరా పర్యవేక్షణకు కొత్తగా డీఎంను నియమించారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలుకు మరో డీఎం ఉండనున్నారు. రైతుల డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. మార్క్‌ఫెడ్, ఆగ్రోస్ గోదాముల నుంచి.. ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకుడు తెప్పించుకుంటారు. ఆర్బీకేల్లోని కియోస్కీల్లో రైతుల పేర్లు, సర్వే నెంబర్లు నమోదు చేసి ఉత్పాదకాలను విక్రయించనున్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు ఎక్కువగా ఉన్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: