భార్య మీద ఉన్న అనుమానంతో ఓ కసాయి తండ్రి రెండు నెలల చిన్నారిని కడతేర్చాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. చిన్నారి నోటికి ప్లాస్టర్ అతికించి గోనె సంచిలో పెట్టి చెరువులో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లికార్జున అనే వ్యక్తి తన భార్య చిట్టెమ్మ, రెండు నెలల పాపతో కలిసి కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పాప ఏడుస్తుండటంతో మల్లికార్జున చిన్నారిని ఓదారుస్తూ ఆస్పత్రి బయటకు తీసుకొచ్చేశాడు. సాయంకాలమైనా తిరిగి రాకపోవడంతో అనుమానంతో భార్య చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు.. రాత్రంతా బంధువుల సాయంతో వెతికినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మల్లికార్జునతో పాటు పాప ఆచూకీ కోసం వాళ్ల ఫొటోలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అనంతపురం జిల్లా కేంద్రంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. విచారణ చేపట్టగా చిన్నారిని తానే చంపినట్లు అంగీకరించాడు. అనంతరం నిందితుడిని కళ్యాణదుర్గం తీసుకొచ్చి విచారిస్తున్నారు. సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పోటెత్తుతున్న దీక్షాస్థలి!