హెచ్చెల్సీ కాలువ ద్వారా తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మరోవైపు గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వరుణుడు కరుణించాడు. జూన్ నుంచి ఇప్పటిదాకా సాధారణ వర్షపాతం 133 మీ.మీ. కాగా.. 283.1 మి.మి. వర్షం కురిసింది. జూన్‌లో 9, జులైలో 16 రోజులు, ఆగస్టులో ఒకరోజు.. ఇలా 26 రోజులు వాన పడింది. హెచ్చెల్సీ జలాలు దండిగా రానున్నాయి. కరవు తీరేలా సాగు నీరు అందుతుండటంతో రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వేరుసెనగ సాగైంది. వరి ఇతర పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
24.988 టీఎంసీల కేటాయింపు
తుంగభద్ర జలాశయానికి ఈ సీజన్‌లో 163 టీఎంసీలు లభ్యమవుతాయని ఇంజినీర్ల బృందం అంచనా వేసింది. ప్రొరేట్ ప్రకారం మన హెచ్చెల్సీ వాటాగా 24.988 టీఎంసీలు కేటాయించారు. ఇప్పటికే టీబీ డ్యామ్‌లో 39.883 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది కంటే పది రోజులు ముందే ఈసారి నీరు విడుదల చేశారు. ప్రస్తుత ఇండెంట్ ప్రకారం 750 క్యూసెక్కుల మేర జిల్లా కోటాగా వస్తున్నాయి. ఆదివారం నాటికి కణేకల్లు చెరువులోకి ప్రవేశించాయి.
1.45 లక్షల ఎకరాల ఆయకట్టు
హెచ్చెల్సీ ద్వారా జిల్లాతోపాటు కడప, కర్నూలు జిల్లాలోనూ కొన్ని ప్రాంతాలకు నీరు వెళుతుంది. అత్యధికంగా మన జిల్లాలోనే 1.45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాయదుర్గం, ఉరవకొండ, అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లో 1.45 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేయనున్నారు. గతేడాది 30.134 టీఎంసీలు రాగా.. పది టీఎంసీలు తాగునీటి అవసరాలకు వాడారు. తక్కిన నీటితో 1.09 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ దఫా కూడా లక్ష ఎకరాలకుపైగా సాగు నీరు ఇవ్వాలని సంకల్పించారు.
ఐఏబీ నిర్ణయమే కీలకం
హెచ్చెల్సీ వాటాలో ఏ కాలువకు ఎన్ని నీళ్లు ఇవ్వాలన్న దానిపై జిల్లా సాగునీటి సలహా మండలి(ఐఏబీ) నిర్ణయమే కీలకం. ఇక్కడి తీర్మానం ప్రకారమే నీటి సరఫరా, మళ్లింపు ఉంటాయి. ఈనెల మూడు లేదా నాలుగో వారంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే కాలువలకు నీరు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం హెచ్చెల్సీ జలాలు కణేకల్లు చెరువుకు చేరాయి. అక్కడి నుంచి పీఏబీఆర్, ఎమ్పీఆర్ జలాశయాలకు మళ్లిస్తారు. కణేకల్లు, జీబీసీ కింద తాగునీటి పథకాలకు ఇవ్వనున్నారు. పీఏబీఆర్, ఎమ్పీఆర్ జలాశయాలపై కొన్ని తాగునీటి పథకాలు ఆధారపడ్డాయి. రెండు రోజుల్లో వాటికి నీరిచ్చే వీలుంది.
జలాశయాలను నింపుతాం
తుంగభద్ర జలాలు ఈనెల ఒకటిన జిల్లా సరిహద్దుకు చేరాయి. ఆదివారం కణేకల్లు చెరువులో ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో పీఏబీఆర్, ఎమ్పీఆర్‌కు మళ్లిస్తాం. ఆయకట్టుకు ఇప్పట్లో ఇవ్వడం కుదరదు. ఐఏబీ నిర్ణయం మేరకే జలాల కేటాయింపు ఉంటుంది. ప్రస్తుతం తాగునీటి పథకాలకు తగిన నీటిని ఇస్తాం.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ... మరో 7822 కరోనా కేసులు