Tiger Roaming in Warangal District : ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభయారణ్యంలోకి ప్రవేశించిన పెద్దపులి తన సంచారాన్ని కొనసాగిస్తోంది. పాదముద్రల ఆధారంగా మగ పులిగా అధికారులు నిర్ధారించారు. అనుకూలమైన ఆవాసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని పాకాల అభయారణ్యంలో బెబ్బులి సంచరిస్తోంది.
ఈ నెల 9న పెద్దపులి ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ములుగు జిల్లాలోకి అడుగుపెట్టింది. వెంకటాపురం మండలం బోదాపురం సమీపంలో రైతు నర్సింహారావు బెబ్బులి గాండ్రింపులను గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది గోదావరి దాటుకుని మంగపేట మండలం నర్సింహసాగర్, మల్లూరు అటవీ ప్రాంతంలో మూడు రోజులపాటు సంచరించింది.
రక్షణ చర్యలు అవసరం : ఎంతో కాలంగా ఏటూరునాగారం అభయారణ్యాన్ని టైగర్ జోన్‌గా చేయాలని చెబుతున్న అధికారులు ఆదిశగా ప్రక్రియను ఆచరణలో తీసుకొస్తే పులికి రక్షణగా ఉంటుంది. దీంతో జీవవైవిధ్యం మెరుగుపడుతుంది.
తొమ్మిది రోజులు తాడ్వాయి అడవుల్లో : మంగపేట అడవి నుంచి 13న తాడ్వాయి పరిధిలోని పంబాపూర్ ప్రాంతంలోకి పులి వచ్చినట్లు అటవీ అధికారులు పాదముద్రలను గుర్తించారు. వారం రోజుల పాటు తాడ్వాయిలోని నర్సాపురం, బందాల అడవుల్లో సంచారం చేసింది. ఆహారం కోసం చిన్న చిన్న జంతువులను వేటాడినట్లు నిర్ధారించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పాటు సంచరించి మళ్లీ తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించింది.
ట్రాప్ కెమెరాల ఏర్పాటు : పెద్ద పులి జాడను గుర్తించేందుకు కొత్తగూడ మండలంలోని అడవుల్లో వన్యప్రాణులు అధికంగా ఉన్న రాంపూర్, కర్నగండి, కోనాపురం, ఓటాయి, కార్లాయి ప్రాంతాల్లో అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో బెబ్బులి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు.
ఆహారం కోసం : 2021లో గూడురు, కొత్తగూడ ఏరియాలో సంచరించిన పెద్దపులి మేతకు వెళ్లిన ఆవులను చంపి తినడం మరల ఈ ప్రాంతంలో బెబ్బులి తిరిగితే అది వేటాడేందుకు వన్యప్రాణులు అవసరమని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే అధికారులు 2022లో వరంగల్ జూపార్క్ నుంచి సుమారు 50 వరకు దుప్పులు, ఇతర వన్యప్రాణులను తీసుకొచ్చి వదిలారు. 2023లో హైదరాబాద్ జూపార్క్ నుంచి 45 వరకు దుప్పులు, జింకలు, నెమళ్లు, ఇతర వన్యప్రాణులను గూడూరు మండలం నేలవంచ కార్లాయి ప్రాంత అడవుల్లో వదిలారు. ఇప్పుడు వాటి సంతతి పెరగడంతో వచ్చిన పులి వేటాడేందుకు వీలుగా ఉందని తెలిసింది.
వరంగల్ జిల్లాలోకి ప్రవేశం : తాడ్వాయిలోని బందాల అడవుల్లో సంచరించిన పులి అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ మండలాల్లోని అటవీ ప్రాంతాల గుండా ఈ నెల 27న వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెం అడవుల్లో సంచరిస్తున్నట్లు పంట పొలాల్లో కనిపించిన దాని అడుగుల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 28న నల్లబెల్లి మండలం ఓల్లెనర్సయ్యపల్లి పంటచేల మీదుగా పెద్దతండా దాటి రుద్రగూడెం శివారులోని ఏనె(బోడు)లోకి వెళ్లినట్లు నిర్ధారించారు. ఆదివారం ఆ ప్రాంతం నుంచి నర్సంపేట మండలం ముత్యాలమ్మతండా మీదుగా ఖానాపురం మండలం కీర్యాతండా సమీపం గుండా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని పాకాల అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు.
మూడేళ్ల తర్వాత : ఉమ్మడి జిల్లాలోకి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పాకాల అభయారణ్యంలో బెబ్బులి సంచరిస్తోంది. 2021 నవంబర్, డిసెంబర్ మాసాల్లో వ్యాఘ్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించి వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల మీదుగా ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశింది. ఆ సమయంలో మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నేలవంచ-కార్లాయి పరిధిలోని అడవుల్లో మేతకు వెళ్లిన ఆవును చంపి సగభాగం వరకే తిన్నది. అక్కడి నుంచి కొత్తగూడ మండలం రాంపూర్ అడవుల్లోకి వెళ్లిన పులి సమీపంలో మేతకు వెళ్లిన ఆవును పూర్తిగా తినేసింది.
పులి మళ్లీ వచ్చింది! - తూర్పు గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న బెబ్బులి
నెల్లూరు జిల్లాలో పులుల సంచారం- భయంతో వణికిపోతున్న స్థానికులు - Tigers Migration